Nov 15,2023 21:55

సాలూరు : గ్రంథాలయ విశిష్టతను విద్యార్థులకు వివరిస్తున్న చైర్‌పర్సన్‌ రెడ్డి పద్మావతి

ప్రజాశక్తి -సాలూరు :  గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ రెడ్డి పద్మావతి అన్నారు. ఈనెల 14నుంచి ప్రారంభమైన 56వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆమె పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హాజరైన విద్యార్థులు, పాఠకులతో ఆమె మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. విద్యార్థులు, యువకులకు ఉపయోగపడేలా దినపత్రికలు, పుస్తకాలతో పాటు పోటీ పరీక్షలకు మేలు చేసే పుస్తకాలు కూడా అందుబాటులో వుంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక శాఖా గ్రంథాలయం అధికారిణి రాధాదేవి పాల్గొన్నారు.
పాలకొండ : గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక శాఖా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన జరిగింది. స్థానిక పెదకాపు వీధి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోమేశ్వరరావుతో పుస్తక ప్రదర్శన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం వల్ల పిల్లలలో ఎక్కువ జ్ఞాపక శక్తి, విజ్ఞానం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి.తిరుపతిరావు, దుర్గారావు, గడ్డెయ్య, గ్రంథాలయ అధికారి బి.గణేష్‌బాబు, సహాయకుడు ఈశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
పాచిపెంట : జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక శాఖాగ్రంథాలయంలో మంగళవారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జూనియర్‌ కాలేజీ అధ్యాపకులు ఉదయకుమార్‌, ప్రవీణ్‌ పాల్గొని పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో లైబ్రేరియన్‌ ఉదయభాస్కర్‌, కాలేజీ విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన గ్రంథాలయ నిర్వాహకులు నల్ల మధుసూదన్‌ రావు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : స్థానిక శాఖా గ్రంథాలయంలో విద్యార్థులతో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల ప్రాముఖ్యత, పుస్తక పఠనంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ప్రతిరోజు గ్రంథాలయాలకు వచ్చి పుస్తక పఠనం చేసి తమ మేధస్సు పెంచుకోవాలని గ్రంధాలయ నిర్వహకురాలు డి.సుకన్య కోరారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వీరఘట్టం : స్థానిక శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి ఎం.వెంకటేశ్వరరావు పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పోటీ పరీక్షలకు, నవలు, పిల్లల పుస్తకాలు, పురాణ గ్రంథాలు వంటివి ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో పాఠకులు పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్‌ : మండలంలోని ఎంఆర్‌నగరం జెడ్‌పి హైస్కూలులో జిల్లా గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉత్సవాలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు డి. విజయకుమార్‌ మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన సంపదను సమకూర్చుతాయని, విద్యార్థులు పఠనాశక్తిని పెంపొందించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంఘ అధ్యక్షులు టి.శివకేశవరావు, పి.డి. కె.తిరుపతిరావు, ఉపాధ్యాయులు కె.సుశీల, పిడి ప్రసాద్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తొలుత విద్యార్థులకు వ్యాసరచన, పద్యపఠనం వంటి అంశాలలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
సీతంపేట : స్థానిక శాఖా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన జరిగింది. స్థానికప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హేమసుందర్‌తో పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో శివకుమార్‌, స్కూల్‌ అసిస్టెంట్‌, గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్‌బాబు, సహాయకుడు రామకృష్ణ పాల్గొన్నారు.