Nov 15,2023 21:34

గ్రంథాలయాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్న డిఇఒ

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
ప్రజాశక్తి - తిరుపతి సిటి
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, టీటీడీ పాఠశాలల విద్యార్థులు క్రమం తప్పకుండా గ్రంథాలయాలను సందర్శించి కొత్త విషయాలను నేర్చుకోవాలని టీటీడీ జెఈవో సదా భార్గవి కోరారు. కేంద్ర ప్రభుత్వం పిలుపుమేరకు నవంబర్‌ 14 నుంచి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులకు గ్రంథాలయాల ప్రాముఖ్యతపై తిరుపతిలోని శ్వేత భవనంలో బుధవారం అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ గ్రంథాలయాల్లో మనకు తెలియని కొత్త విషయాలను చాలా నేర్చుకోవచ్చని, ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు వెళ్లడాన్ని అలవాటుగా మార్చుకోవాలని కోరారు. టీటీడీ పాఠశాలల విద్యార్థులకు వారానికి ఒకరోజు లైబ్రరీ క్లాస్‌ ప్రారంభించాలని, ఇందులో ఒక గంట సేపు విద్యార్థులు గ్రంథాలయంలో గడిపేలా చూడాలని చెప్పారు. గ్రంథాలయంలో ఏదైనా ఒక అంశానికి సంబంధించి పుస్తకాలను ఎలా వెతకాలి అనే విషయాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్వేత భవనంలో గల కేంద్ర గ్రంథాలయంలో వేదాలు, పురాణాలు, సాహిత్యం, చిన్నపిల్లల కథల పుస్తకాలు, పోటీ పరీక్షలు పుస్తకాలు తదితర ఆసక్తికరమైన అనేక పుస్తకాలు ఉన్నాయని, విద్యార్థులు తరచూ సందర్శించి జ్ఞానాన్ని పెంచుకోవాలని కోరారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ధార్మిక ప్రవచనకర్త డా.సి.అనంతలక్ష్మి ధార్మిక, వ్యక్తిత్వ వికాస విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఏవో శేషశైలేంద్ర, విద్యాశాఖాధికారి డా. ఎం.భాస్కర్‌రెడ్డి, శ్వేత డైరెక్టర్‌ ప్రశాంతి పాల్గొన్నారు.
గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా గ్రంథాలయ అధికారి జె.శివప్రసాద్‌ అనాన్రు. తిరుపతి శాఖా గ్రంథాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శన నిర్వహించారు. సంస్థ ఛైర్‌పర్సన్‌ ఎన్‌.మధుబాల, డిఇఒ వి.శేఖర్‌ మాట్లాడుతూ నేటితరం, నిరుద్యోగ యువతీ యువకులు, విద్యార్థులు, విశ్రాంతి ఉద్యోగులు గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలను చదివి జ్ఞానాన్ని సముపార్జన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రిష్ణారెడ్డి చైతన్య ప్రిన్సిపాల్‌ జనార్ధన్‌, డాక్టర్‌ పి.గోపాల్‌, ఇంగ్లీష్‌ ట్రైనర్‌ ముషీర్‌ అహ్మద్‌, యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌, వురు సపోర్ట్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఫౌండర్‌ తహసున్నీసా బేగం, ఎం.మునీంద్ర, పి.గోవిందరాజులు పాల్గొన్నారు.
పుత్తూరు టౌన్‌లో... గ్రంథాలయ అధికారిణి మీనాకుమారి ఆధ్వర్యంలో గ్రంథాలయ పోటీ పరీక్షలు, సైన్స్‌ మార్టిస్‌ పుస్తకాల ప్రదర్శన జరిగింది. పుస్తక ప్రదర్శనను సంస్థ ఛైర్మన్‌ నైనారు మధుబాల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సుజాల్‌ పాల్గొన్నారు.
రేణిగుంటలో... మంచినీళ్ళ గుంట వద్దనున్న గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరిగాయి. ముఖ్యఅతిథిగా సర్పంచ్‌ నగేష్‌ పాల్గొన్నారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునిరత్నం, ఉపాధ్యాయులు, విశాంత్రి వార్డ్‌ మెంబర్‌ పాల్గొన్నారు. భగవద్గీతను చదవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని పరిపాలనా అధికారి డిఎస్‌ హరిబాబు అన్నారు. పుస్తక ప్రదర్శన ప్రారంభించి పుస్తక పఠనం విశిష్టతను వివరించారు. గ్రంథాలయ అధికారిణి శ్రీముఖి, సిబ్బంది రవి, మాణిక్యం, వెంకటరెడ్డి పాల్గొన్నారు.
గ్రంథాలయాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్న డిఇఒ