ప్రజాశక్తి- ములగాడ : మహిళలు తీరిక సమయాల్లో గ్రంథాలయాలకు వెళ్లాలని, తద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కొండా రమాదేవి సూచించారు. మల్కాపురంలోని పల్లివీధిలో ఏర్పాటు చేసిన ''బుక్ డిపాజిట్ సెంటర్'' (బిడిసి)ను ఆమె ప్రారంభించారు. స్థానిక మహిళా నాయకులు రేవు జగదాంబ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రమాదేవి మాట్లాడుతూ, స్థానిక మహిళలు ఏర్పాటు చేసుకున్న ఈ బుక్ డిపాజిట్ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పుస్తకాలు చదవడం ద్వారా సమాజం, వ్యక్తుల పట్ల అవగాహన ఏర్పడుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి పుస్తకాల అధ్యయనం ఎంతో అవసరం అని చెప్పారు. గౌరవ అతిథి, 61వ వార్డు వైసిపి అధ్యక్షులు డిపో సత్యనారాయణ మాట్లాడుతూ, బుక్ డిపాజిట్ సెంటర్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. అవసరమైన పుస్తకాలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాపురం ప్రకాష్‌నగర్‌లోని శాఖాగ్రంథాలయాధికారి అజరుకుమార్, ప్రముఖ న్యాయవాది జికెవి.రాజు, ప్రముఖ కార్మిక నాయకులు బి.సత్యానందం, జిల్లా జాతీయ సేవా పథకం జిల్లా ప్రోగ్రాం అధికారి ఇపిఎస్.భాగ్యలక్ష్మి, స్థానిక మహిళా సంఘాల రిసోర్స్‌పర్సన్ నిర్మల, బుక్ సెంటర్ గ్రంథాలయాధికారి రాఘవ, స్థానిక మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ అధ్యయన కేంద్ర అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తానని చెప్పిన కార్పొరేటర్ కొణతాల సుధకు మహిళలంతా కృతజ్ఞతలు తెలిపారు.










