Nov 17,2022 23:50

రోలుగుంటలో చదరంగం పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లాలోని పలు గ్రంథాలయాల్లో విద్యార్థులకు వ్యాసరచన చిత్రలేఖన పోటీలు నిర్వహించారు.
ప్రజాశక్తి-అనకాపల్లి

స్థానిక బాలాజీరావు పేట జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శాఖ వీధి గ్రంథాలయ అధికారి కె.శ్రీనివాసరావు, సిద్ధార్థ సోషల్‌ సర్వీస్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు బల్ల నాగభూషణం ఆధ్వర్యంలో వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం హసీనా బేగం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కశింకోట : మండలంలోని తాళ్ళపాలెం శాఖా గ్రంథాలయంలో పాఠశాల విద్యార్థులకు సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో వ్యాసరచన, రంగవల్లి (బాలికలకు) పోటీలు నిర్వహించారు. వీటిల్లో 96 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయ అధికారి కె.జగన్‌ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కె.లోవలక్ష్మి, ఎన్‌.రాజ్యలక్ష్మి, ఎ.విజయ, వి.కలైసేల్యవి, ఎంవికె.హరినాధ్‌, ఐ.ప్రశాంతి పాల్గొన్నారు.
అచ్యుతాపురం : స్థానిక గ్రంథాలయంలో విద్యార్థులకు గ్రంథాలయ అధికారి దొడ్డి కోటేశ్వరరావు పర్యవేక్షణలో వ్యాచరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో అచ్యుత, కైట్స్‌, రవీంద్ర, గాయత్రి తదితర ప్రైవేటు పాఠశాలలు, జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు చెందిన 130 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
మునగపాక రూరల్‌ : స్థానిక శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి ఎల్వి రమణ ఆధ్వర్యంలో గురువారం దేశభక్తి గేయాలు పోటీలు, సీనియర్‌ విద్యార్థులకు పర్యావరణం కాలుష్య నివారణ అన్న అంశాలపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. న్యాయ నిర్నేతగా ఉపాధ్యాయులు శివకోటి దుర్గాప్రసాద్‌ వ్యవహరించారు. ఉపాధ్యాయులు వినరు, గణేష్‌ వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
కె.కోటపాడు : స్థానిక శాఖ గ్రంథాలయంలో హైస్కూల్‌ విద్యార్థులకు డ్రాయింగ్‌ పోటీలు నిర్వహించారు. వారోత్సవాలలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు ముగింపు రోజున బహుమతులు ప్రదానం చేయనున్నట్లు గ్రంథాలయాధికారి కె.సౌమ్య తెలిపారు.
సబ్బవరం : స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి పివి.రమణ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీల్లో విజ్ఞాన, ప్రతిభ, మదర్‌ పాఠశాలలు, ప్రభుత్వ హైస్కూల్‌ విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎంఈఓ ఎస్‌.అప్పలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పరిశీలించారు. బి.సింహాద్రి, సిహెచ్‌ కుమార్‌, ప్రసాద్‌, డిఎన్బి కుమారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నక్కపల్లి : గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మండలంలోని చినదొడ్డిగల్లు గ్రంథాలయంలో ఆ శాఖ అధికారి జనార్దన్‌ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో హెచ్‌ఎం అప్పారావు, పిడి దేముళ్ళు ఆధ్వర్యంలో వివిధ క్రీడా పోటీలు జరిగాయి. నక్కపల్లి గ్రంథాలయంలో గ్రంధాలయ అధికారి గోవింద ఈశ్వరరావు ఆధ్వర్యంలో గ్రంథాలయోద్యమకారులకు ఘన నివాళులర్పించారు. విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు.
చీడికాడ : స్థానిక గ్రంథాలయంలో విద్యార్థులకు క్విజ్‌ పోటీలను గ్రంధాలయాధికారిణి ఎంఎస్‌ఎల్‌ జోగేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ క్విజ్‌ పోటీలను హైస్కూల్‌ ఉపాధ్యాయురాలు మాధవి, ఆకాష్‌ స్కూల్‌ కరెస్పాండంట్‌ జి.ప్రసాద్‌ పర్యవేక్షించినట్లు జోగేశ్వరి తెలిపారు.
పాయకరావుపేట : పట్టణంలోని వైయస్సార్‌ శాఖ గ్రంథాలయంలో క్విజ్‌ పోటీలను నిర్వహించారు. ఉప సర్పంచ్‌ జగతా భవాని శ్రీనివాస్‌, ఇన్చార్జి గ్రంథాలయ అధికారి వామాల లక్ష్మణరావు మాట్లాడుతూ, వివిధ పాఠశాలలకు చెందిన 120మంది విద్యార్థులు క్విజ్‌ పోటీల్లో పాల్గొన్నారన్నారు.
కోటవురట్ల : గ్రంథాలయ అధికారి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పలు అంశాల పట్ల విద్యార్థులకు డిబేట్‌ నిర్వహించారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాల, కేజీబీవీ విద్యార్థులు పాల్గొన్నారు.
రోలుగుంట : గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా గురువారం రోలుగుంట శాఖా గ్రంధాలయంలో గ్రంధాలయాధికారి ఎస్‌.వరలక్ష్మీ ఆధ్వర్యంలో చెస్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో రోలుగుంట ఉన్నత పాఠశాల, కేజిబివి, జూనియర్‌ కళాశాల నుంచి 40 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బి.రాజ, కేవిబివి నుంచి వి.శ్యామలకుమారి పాల్గొన్నారు.