Sep 11,2023 22:39

ప్రజాశక్తి-గన్నవరం : నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను ఉమ్మడి జిల్లాల్లోని అన్ని గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచామని ఆ సంస్థ చైర్‌ పర్సన్‌ టి. జమలపూర్ణమ్మ అన్నారు. స్థానిక గ్రేడ్‌-1 గ్రంథాలయానికి సోమవారం పోటీ పరీక్షల పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో జమలపూర్ణమ్మ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే నిరుద్యోగుల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని వసతులు కల్పించాలన్నారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు. విజయ వాడ ఠాగూర్‌ గ్రంథాలయం ప్రక్కనే రూ.56 లక్షలతో నిరుద్యోగుల కోసం అదనపు భవనాన్ని నిర్మించినట్లు చెప్పారు. రూ.1.50 కోట్లతో గ్రంథాలయాలను మరమ్మత్తులు చేపించేందుకు ప్రణాళికా సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే పెనమలూరులో రూ.26లక్షలతో కొత్త భవనాన్ని నిర్మించగా వణుకూరులో రూ.16లక్షలతో కొత్త భవనానికి శంఖుస్థాపన జరిగిందన్నారు. గ్రంథాలయాల అభివద్ధికి దాతల సహ కారం అవసరమన్నారు. సూరపనేని వెంకట పాండు రంగారావు జ్ఞాపకార్ధం ఆయన బావమరిది ఎన్‌ఎస్‌ఎస్‌ఎస్‌ఐ రామాంజనేయులు రూ.5వేలు విలువ చేసే పుస్తకాలు, ఫ్యాడ్లు అందజేసినట్లు తెలిపారు. గ్రేడ్‌-1 లైబ్రేరియన్‌ రమాదేవి, బాబూరావు పాల్గొన్నారు.