ప్రజాశక్తి-విజయనగరం కోట : గ్రంథాలయాలు అందిస్తున్న సేవలను ప్రజలలోకి తీసుకువెళ్లడమే గ్రంథాలయ వారోత్సవాల ముఖ్య ఉద్ధేశమని వారోత్సవాల పరిశీలనకు వచ్చిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ సభ్యులు జీను మహేష్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ముందుగా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని పౌర గ్రంథాలయ శాఖ సహాయ సంచాలకులు వి. రవికుమార్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాచార విప్లవం డిజిటల్ రూపంలో విస్తరిస్తున్నందున ప్రతి జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయంగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలో గ్రంథాలయంలో ఉన్న ఇ-గ్రంథాలయ సాఫ్ట్వేర్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఇంచార్జి కార్యదర్శి బి.లక్ష్మి, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.