Nov 22,2022 00:05

బహుమతులతో తాళ్లపాలెం గురుకుల విద్యార్థినులు

ప్రజాశక్తి-అనకాపల్లి : విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జీవీఎంసీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రుధిర రాణి అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక శాఖ వీధి ప్రభుత్వ గ్రంథాలయం ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్‌, వ్యాసరచన, చిత్రలేఖనం, పద్యాలు, డ్యాన్స్‌ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన 20 మంది విద్యార్థులకు ఆమె చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి కె.శ్రీనివాసరావు, ప్రోగ్రాం కన్వీనర్‌ బల్ల నాగభూషణం, ఉపాధ్యాయులు ఎస్‌కె హసీనా బేగం, ఉదరు, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : బుచ్చయ్యపేట శాఖ గ్రంథాలయంలో సోమవారం గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన గ్రామ సర్పంచ్‌ సుంకర సూరిబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారం రోజులుగా నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సుంకర సత్యారావు, ఉపాధ్యాయులు ఓమ్మి అప్పారావు, గ్రంథాలయాధికారి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
కశింకోట : మండలంలోని తాళ్లపాలెం బిఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో గ్రంధాలయ వారోత్సవాలు సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన, క్విజ్‌, రంగోళి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు 13 మంది విద్యార్థులు గెలుపొందారు. వారికి శనివారం బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎం.మాణిక్యం, గురుకుల గ్రంథాలయ అధికారి ఎం.భారతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.