- మూతపడే దుస్థితిలో 30 గ్రంథాలయాలు
- సెస్ బకాయిలు జమ చేయని స్థానిక సంస్థలు
- జిల్లావ్యాప్తంగా రూ.125 కోట్లు పెండింగ్
- ఒక్క విఎంసి నుంచే రూ.80 కోట్లు పెండింగ్
ప్రజాశక్తి - విజయవాడ : నిధుల సమస్యతో జిల్లాలో గ్రంథాలయ వ్యవస్థ కునారిల్లుతోంది. గ్రంథాలయాల అభివృద్ధి, విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా కేటాయించడంలేదు. దీంతోపాటు సెస్ రూపంలో గ్రంథాలయాల వాటాగా స్థానిక సంస్థలు చెల్లించాల్సిన డబ్బులను దశాబ్దాల తరబడి చెల్లించడంలేదు. గ్రంథాలయ వ్యవస్థకు స్థానిక సంస్థలు ఇప్పటికే భారీగా చెల్లించాల్సి ఉంది. దీంతో గ్రంథాలయ వ్యవస్థ విస్తరణ ఏమోగానీ ఉన్న గ్రంథాలయాల నిర్వహణ భారంగా తయారై తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వాలు కనీసంగా కూడా నిధులు కేటాయించకపోవడం, టెక్నాలజీలో చోటు చేసుకున్న మార్పుల కనుగుణంగా గ్రంథాలయ వ్యవస్థను నూతన తరహాలో అభివృద్ది చేయలేకపోవడం, సాధారణ పాఠకుల్లోనే గాక విద్యాధికుల్లో సైతం పేపరు, పుస్తకాలపై క్రమంగా పఠనాసక్తి తగ్గిపోవడం, అస్తవ్యస్థంగా తయారైన గంథాలయాల నిర్వహణ, ఉన్న కొద్దిపాటి నిధులను సైతం సక్రమంగా వినియోగించలేని దుస్థితి, ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం గ్రంథాలయ వ్యవస్థకు కనీసమైన సహకారం అందించకపోవడంతో గ్రంథాలయ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. విజయవాడ వంటి నగరంలో కూడా గ్రంథాలయాల నిర్వహణ, వాటి అభివృద్ధి పక్కన పెడితే చిన్న పాటి రీడింగ్ రూమ్‌లు కూడా లేవంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వామపక్షాల పాలనాకాలంలో విజయవాడ నగరంలో ప్రతి డివిజన్‌లో రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయడంతోపాటు గ్రంథాలయాల నిర్వహణ ఎంతో బాగుండేదని, ఆనాడు పాఠకులకు వివిధ రకాల పుస్తకాలు, పేపర్లు అందుబాటులో ఉండేవని పలువురు పాఠకులు అభిప్రాయపడుతున్నారు.
విఎంసి నుంచి రూ.80 కోట్లు బకాయి...
సెస్ రూపంలో గ్రంథాలయ సంస్థకు స్థానిక సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు భారీ మొత్తంలో దశాబ్దాల తరబడి పేరుకుపోయాయి. స్థానిక సంస్థలు వసూలు చేసే ఆస్తి పన్నులో నుంచి ఎనిమిది శాతం తప్పని సరిగా క్రమం తప్పకుండా గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సెస్ నిధులతోపాటు ప్రభుత్వాలు కేటాయించే నిధులతో గ్రంథాయాలు నడుస్తుంటాయి. కానీ ఈ రెండూ కూడా జరగడం లేదు. స్థానిక సంస్థలు ఆస్తి పన్నులు వసూలు చేసుకుంటూనే ఉన్నాయి. కానీ గ్రంథాలయాలకు చెల్లించాల్సిన వాటా చెల్లించకుండా వాడేసుకుంటున్నాయి. ఈరకంగా ఒక్క విజయవాడ నగరపాలక సంస్థ నుంచే రూ.80 కోట్ల వరకు సెస్ రూపంలో గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా రూ.125 కోట్లకుపైగా సెస్ బకాయిలు పేరుకుపోయాయి. 2007 సంవత్సరం ముందు నుండే సెస్ బకాయిలు గ్రంథాలయ సంస్థకు రావాల్సి ఉంది. దీనిపై సంబంధిత పాలకవర్గాలు, అధికారులు ఎటువంటి పరిశీలన, పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి లేకుండా పోయింది.
పేపర్ల ఖర్చు కూడా చెల్లించలేని స్థితిలో గ్రంథాలయాలు
ఒక రీడింగ్ రూమ్‌లో కనీసంగా రెండు మూడు పేపర్లు కూడా వేయించలేని దయనీయ పరిస్థితిని జిల్లా గ్రంథాలయ సంస్థ ఎదుర్కొంటోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 30 గ్రంథాలయాలకుపైగా మూసివేసే దశకు చేరుకున్నాయి. జిల్లాలోని యలవర్రు, పెదపారుపూడి తదితర గ్రామాల్లో గ్రంథాలయాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. జిల్లావ్యాప్తంగా లెక్కకు 109 గ్రంథాలయాలు, మరో 90 బుక్ డిపాజిట్ సెంటర్లు (బిడిసి) ఉన్నా వీటిలో అత్యధికంగా నడవటం లేదు. కనీసం నిర్వహణ ఖర్చు భరించే స్థితిలో లేవు. జిల్లావ్యాప్తంగా విజయవాడ ఠాగూర్ గ్రంథాలయం వంటి పెద్ద లైబ్రరీలు తొమ్మిది నడుస్తున్నాయి. విజయవాడ, మచిలీపట్నం, జగ్గయ్యపేట, గుడివాడ, నూజివీడు, తిరువూరు, అవనిగడ్డ, నందిగామ, మైలవరం పట్టణాల్లో పెద్ద లైబ్రరీలు ఉన్నా పాఠకులకు అనుగుణంగా వీటి నిర్వహణ ఉండటం లేదు. వివిధ పోటీ పరీక్షల దగ్గర నుంచి సాహిత్య, ఇతర అన్ని రకాల పుస్తకాలు అందించలేని పరిస్థితి ఉంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక్క లైబ్రరీగానీ, రీడింగ్ రూమ్‌గానీ లేకపోవడం గమనార్హం.
సిబ్బందికి జీతాల సమస్య
జిల్లావ్యాప్తంగా దీర్ఘకాలంగా గ్రంథాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది జీతాల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక సంస్థల నుంచి వచ్చే సెస్ డబ్బుల నుంచే ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి వస్తుండటంతో నిధులు లేక వారి జీతాలు కూడా చెల్లించే పరిస్థితి నెలకొంది. ఉద్యోగుల జీతాలను 010 పద్దు ద్వారా చెల్లిస్తే గ్రంథాలయ వ్యవస్థపై కొంత భారం తగ్గుతుంది. తద్వారా గ్రంథాలయాల అభివృద్ధికి కొన్ని నిధులనైనా వెచ్చించే అవకాశం ఉంటుంది.










