Nov 16,2023 23:42
నివాళులర్పిస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ గఫార్‌

ప్రజాశక్తి-కనిగిరి: బ్రిటిష్‌ కాలం నుంచే భారతీయులకు స్వాతంత్య్ర ఉద్యమ సమాచారం, జ్ఞాన సమపార్జన కోసం గ్రంథాలయాలు అవసరమని, ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని పోరాడిన అమరవీరులు అయ్యంకి వెంకటరమణయ్య, ఎస్‌ఆర్‌ రంగనాథన్‌, పాతూరి నాగభూషణం ఆదర్శప్రాయులని కనిగిరి మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ అన్నారు. కనిగిరి శాఖా గ్రంథాలయంలో జరుగుతున్న 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో మూడో రోజు గురువారం గ్రంథాలయ ఉద్యమకారులకు నివాళి అర్పించే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రసంగించారు. తదనంతరం గ్రంథాలయ ఉద్యమకారుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. రిటైర్డ్‌ ఉపాధ్యాయులు, యుటిఎఫ్‌ నాయకులు మాలకొండారెడ్డి మాట్లాడుతూ స్థానిక పాఠశాల విద్యార్థులు అందరూ గ్రంథాలయాలను సందర్శించి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు. జెవివి గయాజ్‌ మాట్లాడుతూ విద్యార్థులకు తరగతి విద్యతో పాటు లోకజ్ఞానం అవసరమని, లోకజ్ఞాన సమపార్జనకు ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలలో పుస్తక పఠనం అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకుడు షేక్‌ అహ్మద్‌ షరీఫ్‌, గోపాలకృష్ణారెడ్డి, మనీష, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.