ప్రజాశక్తి - దేవనకొండ
నిరుద్యోగ యువత, విద్యార్థులు గ్రంథాలయ సేవలను ఉపయోగించుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. మంగళవారం దేవనకొండ గ్రంథాలయంలో లైబ్రేరియన్ అశోక్ అధ్యక్షతన 'గ్రంథాలయాల అభివృద్ధి-ప్రజల భాగస్వామ్యం' అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రంథాలయాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు గ్రంథాలయాల్లో లభించేలా వైసిపి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు, నవలలు, కథల పుస్తకాలు సైతం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యువత, విద్యార్థులు సెల్ ఫోన్లలో నిమగం కాకుండా పుస్తకాలు చదువుకునేలా ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులు చొరవ చూపాలని కోరారు. దేవాలయాలు, విద్యాలయాలతో సమానంగా ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. జిల్లాలో అన్ని పంచాయతీల్లో ఇంటి పన్నులో 8 శాతం గ్రంథాలయ పన్ను వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ పన్ను రూపేణా వచ్చే ఆదాయాన్ని మాత్రం గ్రంథాలయాలకు చెల్లించకపోవడం దారుణమన్నారు. జిల్లాలో రూ.24 కోట్లు గ్రంథాలయ పన్ను రావాల్సి ఉందని, ఆయా పంచాయతీలు చెల్లించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రంథాలయాల్లోని పుస్తకాలు చదువుకోవడానికి శాశ్వత సభ్యత్వం రూ.100 చెల్లించాలని కోరారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన పలువురు సభ్యత్వం తీసుకున్నారు. జడ్‌పిటిసి కిట్టు, వైసిపి మండల కన్వీనర్ మల్లికార్జున, ఆలూరు మాజీ జడ్‌పిటిసి రామ్ భీంనాయుడు, తెర్నేకల్ మాజీ సర్పంచి రాజన్న, వైసిపి నాయకులు మీనుగ కృష్ణ, చందమామ రాముడు, బెల్లం దొడ్డి రాజు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సుభాష్ చంద్రబోస్










