కడప ప్రతినిధి :కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం అధికార పార్టీ కార్పొరేటర్ల తీరు వన్‌మ్యాన్ షోను తలపించింది. గురువారం కార్పొరేషన్‌లోని మూడవ అంతస్తులోని సభాభవన్‌లో మేయర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కడప నగర మాస్టర్‌ప్లాన్‌పై చర్చకు ఎందుకు పెట్టలేదని కార్పొరేటర్ పాకా సురేష్ నిలదీశారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ డిప్యూటీ ప్లానింగ్ ఆఫీసర్‌ను వివరించాలని ఆదేశించారు. డిసిపి వివరణ పట్ల కార్పొరేటర్లు సంతృప్తి చెందక పోవడంతో కమిషనర్ జోక్యం చేసుకుని కోవిడ్ సమయంలో మాస్టర్ ప్లాన్ రావడంతో పూర్తి స్థాయిలో చర్చకు పెట్టలేకపోయారని తెలిపారు. యుడిఆర్‌ఐ గవర్నెన్స్ ప్రకారం అనుడా అధికారులు మాస్టర్ ప్లాన్ తెచ్చారన్నారు. దీనిపై డిప్యూటీ సిఎం అంజాద్‌బాషా స్పందించి మాస్టర్‌ప్లాన్‌పై అనుడా, కార్పొరేషన్, ప్రజాప్రతినిధులతో కలిపి సమావేశం ఏర్పాటు చేసి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎకోపార్క్ భవనాన్ని టెండర్ కండిషన్స్ మేరకు స్వాధీనం చేసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. గతంలో కమిషనర్ ఆరుసార్లు టెండర్ కండిషన్ల మేరకు నిర్మాణాలు చేపట్టడం లేదని ఆరుసార్లు నోటీసులు జారీ చేశారని, దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దీనిపై మేయర్ స్పందించి గత్యంతరం లేకపోవడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశిద్దామని పేర్కొనడం గమనార్హం. తర్వాత కార్పొరేషన్ పరిధిలోని శ్మశానవాటికల అభివృద్ధికి కార్పొరేటర్లతో కమిటీ వేయాలని, సమస్యలు తలెత్తితే కార్పొరేటర్ల కమిటీ వెళ్లి చర్చించి పరిష్కారం చూపుతుందని డిప్యూటీ సిఎం అంజాద్‌బాషా పేర్కొన్నారు. తిలక్ నగర్, రామకృష్ణానగర్ ప్రాంతాల్లో మట్టి రోడ్డు ప్రతిపాదనలకు ఏళ్ల తరబడి మోక్షం లభించకపోవడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ విలీన ప్రాంతాల్లో వీధిలైట్లు కూడా వెలగడం లేదని, తాగునీరు కలుషితం గాకుండా చూడాలని ఆందోళన వ్యక్తం చేశారు. ముంపు నివారణకు డ్రెయినేజీ పనులు ఎప్పుడు చేపడతారని నిలదీశారు. కార్పొరేషన్ శివారు ప్రాంతాలైన ఇందిరానగర్, చెర్లోపల్లి, మామిళ్లపల్లి ప్రాంతాల్లోని స్థలాలు అక్రమణలకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కమిషనర్ స్పందించి కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వస్థలాలు, లేఅవుట్లు తదితర వివరాల డేటాను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పెట్రోల్‌బంకును క్యాష్‌లెస్ పద్ధతిలో నిర్వహించాలని సూచించారు. అనంతరం కార్పొరేషన్‌లో ముంపును నిలువరించడానికి ఉద్దేశించి రూ.69 కోట్లతో 21 డ్రెయినేజీలను ప్లాన్ చేశామని వివరించారు. పాత మున్సిపాలిటీ స్థలంలో మల్టీఫ్లెక్స్, షాపింగ్‌మాల్ ఏర్పాటు వ్యవహారంలో జాప్యాన్ని కార్పొరేటర్లు ప్రశ్నించారు. సంబంధిత కాంట్రాక్టు అప్పగించి ఏళ్ల తరబడి జాప్యం జరుగుతున్నప్పటికీ ప్లానింగ్ సెక్షన్ ఏమిచేస్తోందని ప్రశ్నించారు. రూ. 60 కోట్ల ఆస్తి వృథాగా మారడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కమిషనర్ స్పందించి సదరు కాంట్రాక్టర్‌కు ఆరుసార్లు రీమైండర్స్ జారీ చేశామని, లీగల్ ప్రకారం ముందుకెళ్లి పరిష్కారించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అనంతరం కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ వ్యవహారం వేడెక్కించింది. అద్దె గదుల నిర్వాహకుల దగ్గర నుంచి కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ల పేర్లతో కూడిన నెంబర్‌తో ఫోన్ చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పలు వురు కార్పొరేటర్లు విరుచుకుపడ్డారు. దీనిపై కమిషనర్ సీరియస్‌గా తీసుకోకపోవడం విస్మయాన్ని కలిగించింది. కోర్టు స్టేల కారణంగా స్వాధీనం చేసుకోవడం కుదరడం లేదని రెవెన్యూ అధికారులు చెప్పినప్పటికీ సంతృప్తి కలగకపోవడం గమనార్హం. ఒకటి, రెండు గదులపై కోర్టు స్టే విధించిందని, మిగిలిన గదులను ఎందుకు స్వాధీనం చేసుకోలేదనే ప్రశ్నలకు సమాధానం కరువైంది. కార్పొరేషన్‌లో కలుషిత నీరు సరఫరా అవుతుందనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, కలుషిత నీటిని నిలువరించాలని ఆదేశించి నప్పటికీ ఆశించిన స్పందన కరువైందని, కార్పొరేషన్ అధికారుల పనితీరు అధ్వాన్నంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కార్పొరేటర్ సూర్య నారాయణ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల తీరు అధ్వానంగా ఉందని, కార్పొరేటర్లు సమస్యను తీసుకెళ్తే కమిషనర్ చెబితే చేస్తామని ముక్తసరిగా చెబుతున్నారని, అదే పనులపై బాధితులే వెళ్తే సచివాలయం పక్కకు తీసుకెళ్లి మాట్లాడుకుంటు న్నారని వివరించారు. సచివాలయాలు అవినీతికి నిలయాలుగా మా రాయని విమర్శించారు. దీనిపై డిప్యూటీ సిఎం స్పందించి కార్పొరేషన్ మొదలుకుని సచివాలయాన్నింట్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయాలని సూచించారు. దీనికి కమిషనర్ స్పందించి ఇప్పటికే కార్పొరేషన్‌లో ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నా మని,సచివాలయాలకు వర్తింపజేస్తామని చెప్పారు. అంతకుముందు ఉపాధ్యాయ ఎంఎల్‌సి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పాత మున్సిపల్ స్థలాభివృద్ధి తరహాలోనే పాత కలెక్టరేట్‌ను సైన్స్ మ్యూజియంగా మార్పు చేయాలని సూచించారు.










