Dec 19,2021 15:33

మాంసాహారం మనకు కొత్తేమీ కాదు. కానీ మాంసాహారంలోనూ అన్ని జంతువులనూ అందరూ తినరు. మన దేశంలో అయితే మెజారిటీ జనం తినే జంతువులు కొన్నే ఉంటాయి. కోళ్లు, మేకలు, గొర్రెలు వరకూ పెద్దగా అభ్యంతరాలు కనిపించవు. కానీ ఒక్కో దేశంలో ఒక్కో జంతువు మాంసం ఫేమస్‌. అయితే రాష్ట్రంలో గాడిద మాంసానికి డిమాండ్‌ ఉంది. తాడేపల్లి పరిసరాల్లో దీని విక్రయాలు జోరుగా సాగుతాయి. అందుకే ఏమోగానీ దీన్ని 'తాడేపల్లి స్పెషల్‌' అనే పేరుతో పిలుస్తారు. మిగతా వాటిలానే దీని మాంసంతోనూ బిర్యానీలు, కబాబ్‌లు, పాయ, కార్జం.. ఇలా రకరకాల వెరైటీలు చేసుకుని, తింటున్నారు. అవి ఎలా తయారుచేయాలో చూద్దాం..!
ఖైమా ఫ్రై
కావాల్సిన పదార్థాలు : గాడిద మాంసం ఖైమా-1/2 కేజీ, కారం- స్పూను, ఉల్లిపాయలు- కప్పు, పచ్చిమిర్చి- మూడు, గరంమసాలా-2 స్పూన్లు, పసుపు-1/4 స్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్ట్‌-2 స్పూన్లు, ఉప్పు-తగినంత, కొత్తిమీర-కొద్దిగా, లవంగాలు-2, చెక్క-కొద్దిగా, కరివేపాకు-రెండు రెబ్బలు.
తయారుచేసే విధానం : శుభ్రం చేసుకున్న ఖైమాకి ఉప్పు, కారం, పసుపు కలిపి, కుక్కర్‌లో మూడు విజిల్స్‌ వచ్చే వరకూ ఉడికించాలి.
- పాన్‌లో నూనెపోసి వేడెక్కాక లవంగాలు, చెక్క వేసి కలపాలి.
- ఇందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి, బాగా కలిపి మగ్గనివ్వాలి.
- ఇందులో ముందుగా ఉడికించుకున్న ఖైమాను వేసి, కలుపుకోవాలి.
- రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి కలిపి, మూతపెట్టాలి.
- ఐదు నిమిషాలు ఉడికాక గరంమసాల వేసి తిప్పుకోవాలి.
- మూత పెట్టి మరో ఐదునిమిషాలు మగ్గనివ్వాలి.
- ఇప్పుడు కొత్తిమీర వేసి నీరంతా ఇగిరిపోయే వరకూ ఉంచితే ఖైమా ఫ్రై రెడీ.
- ఈ ఫ్రైని బర్గర్స్‌లో పెట్టుకుని తింటే అదిరిపోతుంది.

గరం.. గరం.. గాడిద మాంసం
పెప్పర్‌ ఫ్రై
కావాల్సిన పదార్థాలు : గాడిద మాంసం-1/2 కేజీ, కారం-2 స్పూన్లు, ధనియాలపొడి-2స్పూన్లు, ఎండుమిర్చి-2, పచ్చిమిర్చి-2, అల్లంవెల్లుల్లి పేస్టు-2 స్పూన్లు, నల్లమిరియాల పొడి- 2 స్పూన్లు, ఉల్లిపాయలు- కప్పు (తరుము), ఉప్పు-రుచికి సరిపడా, నిమ్మరసం- స్పూన్‌, పసుపు-1/2 స్పూన్‌, నూనె- వండడానికి సరిపడా.

తయారుచేసే విధానం : ముందుగా గాడిద మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి, శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి.
- మాంసానికి ఉప్పు, నూనె, పసుపు, కారం వేసి కలుపుకుని, కొద్దిసేపు మేరినేట్‌ చేసుకోవాలి.
- తర్వాత కుక్కర్‌లో వేసి కొద్దిగా నీరు పోసి, 20 నిమిషాలపాటు ఉడికించుకోవాలి.
- ఇప్పుడు పాన్‌లో నూనె పోసి వేడెక్కాక, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి.
- తర్వాత అల్లంవెల్లుల్లి పేస్టు, ముక్కలుగా చేసిన ఎండుమిర్చి వేసి, దోరగా వేగనివ్వాలి.
- ఇందులో ఉడికించిన మాంసాన్ని వేసి, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
- మషాలాలు కూరకు పట్టేందుకు కొద్దిసేపు మూత పెట్టుకోవాలి.
- తర్వాత నిమ్మరసం పిండుకుని, అడుగంటకుండా సన్నని మంటపై వేగనిచ్చి దించేసుకోవాలి.

గరం.. గరం.. గాడిద మాంసం

కబాబ్స్‌
కావాల్సిన పదార్థాలు : గాడిద మాంసం-1/2 కేజీ, కారం- 2 స్పూన్లు, గరంమసాలా-స్పూన్‌, నూనె-తగినంత, పసుపు-చిటికెడు, ఉప్పు-తగినంత, పెరుగు- స్పూన్‌, ఉల్లిపాయ-ఒకటి (రౌండ్‌గా కట్‌ చేసుకోవాలి), కొత్తిమీర-కొద్దిగా (గార్నిష్‌కి).
తయారుచేసే విధానం : మెత్తటి గాడిద మాంసాన్ని ముక్కలుగా కట్‌ చేసి, శుభ్రంగా కడుక్కోవాలి.
- మాంసానికి కొద్దిగా పెరుగు, నూనె, పసుపు, కారం, మసాలా పొడి వేసి కలుపుకోవాలి.
- ఫ్రిజ్‌లో పెట్టి, సుమారు గంట మేరినేట్‌ చేసుకోవాలి.
- సన్నని ఇనుప చువ్వలు తీసుకుని ముక్కలను దానికి గుచ్చుకోవాలి.
- వీటిని బగ్గుల గ్రిల్‌పైగానీ, ఎలక్ట్రికల్‌ గ్రిల్‌పైగానీ పెట్టి, రోస్ట్‌ చేసుకోవాలి.
- మధ్యమధ్యలో సన్నని బ్రెష్‌తో నూనెను రాస్తూ కాలనివ్వాలి. అంతే గాడిద మాంసం కబాబ్స్‌ రెడీ.. వీటిపై నిమ్మరసం పిండుకుని, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని, సర్వ్‌ చేసుకోవాలి.

గరం.. గరం.. గాడిద మాంసం
గ్రేవీ కూర
కావాల్సిన పదార్థాలు : గాడిద మాంసం-1/2 కేజీ, కారం- 2 స్పూన్లు, టమాటా ముక్కలు-2 కప్పులు, ఉల్లిపాయలు-2 కప్పులు, పచ్చిమిర్చి- నాలుగు, గరంమసాలా-2 స్పూన్లు, పసుపు-1/4 స్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్ట్‌-2 స్పూన్లు, ఉప్పు-తగినంత, చింతపండు పులుసు -కప్పు, కొత్తిమీర-కొద్దిగా.
తయారుచేసే విధానం : శుభ్రం చేసుకున్న మాంసాన్ని ఉప్పు, కారం, పసుపు, మసాలాపొడి వేసి, కొద్దిసేపు కుక్కర్‌లో ఉడకనివ్వాలి.
- పాన్‌లో నూనెపోసి వేడెక్కాక అందులో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు వేసి, మగ్గనివ్వాలి.
- ఇందులో ఉడకబెట్టిన మాంసాన్ని వేసి, కలుపుకోవాలి.
- కొద్దిసేపు ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి, కలుపుకోవాలి.
- ఐదు నిమిషాల తర్వాత చింతపండు పులుసు వేసి, ఉడకనివ్వాలి.
- ఇందులో గరంమసాలా పొడి వేసి, కలుపుకోవాలి.
- 10 నిమిషాలు ఉడికాక కొత్తిమీర చల్లుకుని, దించేసుకోవాలి.