ప్రజాశక్తి-పాడేరు: హుకుంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల వసతి గృహంలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.చిన్నారావు గిరిజన సంక్షేమ అధికారులను కోరారు ఈ మేరకు శనివారం పాడేరులో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు సహాయ గిరిజన సంక్షేమ అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ కళాశాల బాలికల వసతి గృహంలో విద్యార్థినీలు వసతి సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సరిపడిన వసతి సాకర్యం లేక ఇబ్బందికి గురవుతున్నారని చెప్పారు, మరుగుదొడ్లు, తాగునీటి సమస్య కూడా ఉన్నాయని దీనిపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. కస్తూర్బా , జిటి డబ్ల్యూ ఇంగ్లీష్ మీడియం ఆశ్రమం పాఠశాలలో భవనాల కొరతతో విద్యార్థుల నిద్రించడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాలేజీ, ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మెనూ అమలు చేయలేదన్నారు. విద్యార్థులకు కాస్మోటిక్స్ చార్జీలు ఇవ్వాలన్నారు. విద్యార్థులు గజ్జి, తామర, రక్తహీనత బాధపడుతున్నారని తెలిపారు. వెంటనే హాస్టల్స్‌లో మెడికల్ క్యాంపు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే స్పందించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చిన్నారావు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు.ఎస్.మత్సరాజు, బి.నరేష్ తదితరులు పాల్గొన్నారు.










