Nov 22,2022 23:06

  • ఐదుగురు విద్యార్థులకు అస్వస్థత
  • విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ పార్టీల నేతల నిరసన
  • పాఠశాల ఆవరణలో బైఠాయింపు
  • ఎంపిడిఒకు ఫిర్యాదు

ప్రజాశక్తి - జగ్గయ్యపేట : గ్రీన్‌టెక్‌ ఫ్యాక్టరీ కాలుష్యంతో ప్రజలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. తాజాగా ఎన్‌టిఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్‌ మహమ్మద్‌పేట గ్రామంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో మంగళవారం ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం పాఠశాల ప్రార్థన సమయంలో షేర్‌ మహమ్మద్‌పేట గ్రామ సమీపంలోని గ్రీన్‌టెక్‌ ఫ్యాక్టరీ నుండి తీవ్ర దుర్వాసన వెలువడడంతో ఆ పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థినులు ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థునులు పొన్నెబోయిన బాలసైదా, బడుగుల మౌనిక, గుడారి నందిని, సుంకర అక్షిత, ఎడారి నాగసాయి వాంతులు చేసుకున్నారు. వాంతులు కావడం, తల తిరగటం, కడుపులో తిప్పటం వంటి ఇబ్బందులకు గురయ్యారు.
పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ పార్టీల నేతల నిరసన
ఈ సంఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు ఒక్కసారిగా పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. విద్యార్థులతో కలిసి పాఠశాలలో బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజలు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, అక్కడి నుండి వెంటనే తరలించాలని, తమ ఆరోగ్యం కాపాడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నినాదాలు చేశారు. ఎంపిడిఒ టి.జయచంద్ర, బూచవరం పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌, వైద్య సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీ, పోలీసులు హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకున్నారు. డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ తమ సిబ్బందితో వాంతులు చేసుకున్న విద్యార్థులను పరీక్షించారు. వారిని మధ్యాహ్నం మూడు గంటల వరకు తమ పర్యవేక్షణలో ఉంచారు. ఎంపిడిఒ టి జయచంద్ర మాట్లాడుతూ ఫ్యాక్టరీ నుండి వస్తున్న కాలుష్యంతో విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు చెబుతున్నారని, దీనిపై ఫ్యాక్టరీ వారిని సంప్రదిస్తే అన్ని అనుమతులతోనే తాము ఫ్యాక్టరీ నడుపుతున్నామని, ఎటువంటి కాలుష్యం రావట్లేదని చెబుతున్నారని అన్నారు. దీనిపై కోర్టుకెళితే సంబంధిత అధికారులు వచ్చి పరీక్షిస్తారని పేర్కొన్నారు. ఈ సంఘటనపై కలెక్టర్‌కు నివేదిక పంపుతామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు కాలుష్యం వెదజల్లే గ్రీన్‌టెక్‌ ఫ్యాక్టరీని తొలగించి తమ ప్రాణాలను కాపాడాలని కోరుతూ ఎంపిడిఒకు వినతిపత్రం అందజేశారు. ఎంపిడిఒ వెంట విఆర్‌ఒ వెంకటరత్నం, గ్రామ పంచాయతీ జూనియర్‌ అసిస్టెంట్‌ సిహెచ్‌.వి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
తలుపులు మూసి పాఠాలు బోధించాం
పాఠశాల హెచ్‌ఎం రమణ
ఫ్యాక్టరీ నుండి రోజూ దుర్వాసన వస్తోంది. మంగళవారం మరింత ఎక్కువగా ఫ్యాక్టరీ నుండి వాసన రావడంతో విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో పాఠశాలలోని తరగతి గదుల తలుపులు మూసి పాఠాలు బోధించాం.
తక్షణమే మూసివేయాలి
సిపిఎం మండల, పట్టణ కార్యదర్శి సోమోజు నాగమణి
గ్రీన్‌టెక్‌ ఫ్యాక్టరీని తొలగించాలని మూడేళ్లుగా గ్రామ ప్రజలు వివిధ రూపాల్లో ఎన్నో పోరాటాలు చేసినా ఫలితంలేకుండా పోయిందని, తాజాగా విద్యార్థులు వాంతులు చేసుకొని అస్వస్థతకు గురయ్యారని సిపిఎం మండల, పట్టణ కార్యదర్శి సోమోజు నాగమణి పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు స్పందించడం కాకుండా తక్షణమే ఫ్యాక్టరీని ఇక్కడి నుండి తీసివేయాలన్నారు. విద్యార్థులు, మూడు గ్రామాల ప్రజల ప్రాణాలను ప్రాణంగా పెట్టడం సరికాదన్నారు. ప్రజల ప్రాణాలు కన్నా ఫ్యాక్టరీ లాభాలే మిన్నగా ప్రభుత్వం, అధికారులు ఆలోచించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఫ్యాక్టరీని తీసివేయకపోతే ప్రజలందరినీ కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో సిపిఎం నాయకులు కోటా కష్ణ, షేక్‌ గౌస్‌మియా, ఎస్‌ రామనాథం, షేక్‌ మేరా సాహెబ్‌, టిడిపి గ్రామ అధ్యక్షులు షేక్‌ సుభాని, షేక్‌ జానీ, మస్తాన్‌ వలీ, బడేమియా, వైసిపి గ్రామ అధ్యక్షులు డి.కమలేష్‌ పాల్గొన్నారు.
కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లిన సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ
గ్రీన్‌టెక్‌ ఫ్యాక్టరీ వెలువడుతున్న దురాసనతో విద్యార్థులు, ప్రజలు అనారోగ్యం పాలవుతున్న విషయాన్ని సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై గత కొంతకాలంగా ప్రజలు నిరంతరం వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారని, ఈసమస్యను తమ దష్టికి కూడా తీసుకువచ్చారని గుర్తుచేశారు. తక్షణం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఫ్యాక్టరీ కాలుష్యంపై ఎన్నో ఏళ్లుగా ఆందోళనలు
గ్రామ సమీపంలో గల గ్రీన్‌ టెక్‌ ఫ్యాక్టరీని తొలగించాలని గత కొన్నేళ్లుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో అనేక రూపాల్లో ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, తహశీల్దారు, ఎంపిడిఒ, కాలుష్య నియంత్రణ అధికారికి ఇలా అనేక మందిని కలిసి వినతిపత్రాలు సమర్పించారు. కోవిడ్‌ సమయంలోనే 2,500 మంది సంతకాలు సేకరించి జగ్గయ్యపేట తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేసి సంతకాలతో కూడిన వినతిపత్రాలను సమర్పించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఫ్యాక్టరీని తరలించే చర్యలు తీసుకుంటామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చినా అమలుకు నోచుకోవడంలేదు. పర్యవసానంగా గ్రీన్‌టెక్‌ ఫ్యాక్టరీ నుండి వస్తున్న కాలుష్యంతో గ్రామ సమీపంలో గల మోడల్‌ కాలనీ, కూతవేటు దూరంలో గల జిల్లా పరిషత్‌ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 450 మంది విద్యార్థులపై కాలుష్య ప్రభావం పడుతోంది. రోజూ దుర్వాసనతో విద్యార్థులకు కడుపులో తిప్పటం, తలనొప్పి రావడం, వాంతులు చేసుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఫ్యాక్టరీ సమీపంలో గల పంట పొలాల్లోకి పనులకు కూలీలు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఫ్యాక్టరీ సమీపంలో గల రామచంద్రుని పేట, అనుమంచిపల్లి, షేర్‌ మమ్మద్‌పేట గ్రామాల ప్రజలు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి సమయంలో మరింతగా దుర్వాసనతో ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలంలో ఆరుబయట, భవనాలపై నిద్రించే పరిస్థితి కూడా లేకుండా పోతోంది.