చింతలపూడి నియోజకవర్గంలో కొనసాగిన లోకేష్ యువగళం
199వ రోజు బొర్రంపాలెం నుంచి జంగారెడ్డిగూడెం వరకూ యాత్ర
బహిరంగ సభలో చింతలపూడి, పోలవరం ఎంఎల్‌ఎలపై అవినీతి ఆరోపణలు
టిడిపిలో చేరిన పలువురు నేతలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి, జంగారెడ్డిగూడెం
టిడిపి అధికారంలోకొచ్చాక గ్రీన్‌ఫీల్డ్ హైవే బాధిత రైతులకు 2013 భూసేకరణ చట్టప్రకారం న్యాయం చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర 199వ రోజు బుధవారం పోలవరం నియోజకవర్గం టి.నర్సాపురం మండలం బొర్రంపాలెంలో ప్రారంభమై వల్లంపట్ల, మల్లుకుంట, రావికంపాడు మీదుగా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలంలోని దేవులపల్లి, పుట్టగట్లగూడెం, గురవాయిగూడెం మీదుగా జంగారెడ్డిగూడెం వరకూ సాగింది. జంగారెడ్డిగూడెం సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడారు.
యాత్రలో లోకేష్‌కు గజమాలలతో టిడిపి నాయకులు స్వాగతం పలికారు. జనంతో కరచాలనం చేస్తూ, పలకరిస్తూ లోకేష్ ముందుకు సాగారు. పుట్లగట్లగూడెం వద్ద జంగారెడ్డిగూడెం మండలం గ్రీన్‌ఫీల్డ్ హైవే బాధిత రైతులు లోకేష్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రజోపయోగార్థం భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. జాతీయ రహదారి విస్తరణకు 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించకపోవడం దురదృష్టకరమన్నారు. టిడిపి అధికారంలోకొచ్చాక గ్రీన్‌ఫీల్డ్ హైవే రైతులకు చట్టప్రకారం న్యాయం చేస్తామన్నారు. రైతుల పొలాలకు నీరందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. లక్కవరం గ్రామానికి చెందిన మత్స్యకారులు లోకేష్‌ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు ఉపయోగపడే చెరువులను సైతం జగన్ వైసిపి దొంగలకు కట్టబెడుతున్నాడన్నారు. చంద్రబాబు పాలనలో మత్స్య కారులకు చెరువులు ఇవ్వాలని జిఒ ఇస్తే జగన్ తమ పార్టీ నాయకులకు చెరు వులు ఇవ్వాలని చూడటం దుర్మార్గమన్నారు. తాము జిఒ 217ను రద్దు చేస్తా మన్నారు. న్యాయవాదులు తమ సమస్యలపై లోకేష్‌కు వినతిపత్రం ఇచ్చారు.
టిడిపిలో చేరిన పలువురు నేతలు
పలువురు నేతలు లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్‌యాదవ్, ఆయన సోదరుడు మంగపతి యాదవ్ టిడిపిలో చేరారు. లోకేష్ వారికి పసుపు కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. వైసిపి నేతలు పాకనాటి శ్రీనివాస్‌యాదవ్, పొన్నబోయిన సురేష్‌యాదవ్, చేకూర్తి మల్లాచారి, నీలపాల సూర్యచంద్ర, రాసూరి నాగరాజు, గోరుమచ్చు రవితేజ, శ్రీనివాస్ టిడిపిలో చేరారు.
తారాస్థాయికి చింతపూడి, పోలవరం ఎంఎల్‌ఎల అవినీతి
జంగారెడ్డిగూడెంలో జరిగిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ చింతలపూడి ఎంఎల్‌ఎ ఎలిజాపైనా, పోలవరం ఎంఎల్‌ఎ బాలరాజుపైనా తీవ్ర అవినీతి ఆరోపణలు గుప్పించారు. చింతలపూడి ఎంఎల్‌ఎ పేరు ఎలిజా కాదని, అవినీతి రాజా అన్నారు. పాస్ పుస్తకాల్లో లంచం, ఎర్రకాలువ రిజర్వాయర్‌లో మట్టి కొట్టేసి కోట్లు సంపాదన, షిప్ట్ ఆపరేటర్లు, అంగన్‌వాడీ, ఆయాల నియామకాల్లో లంచాలు, ఇసుక దోపిడీ, భూముల్లో దోపిడీ, కొత్త అధికారి వస్తే మూడు నెలల జీతం కప్పం, ఇలా అనేక విధాలుగా దోచుకుంటున్నారన్నారు. పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు కాదని, బాలనాగు అని అన్నారు. గోదావరిలో ఇసుకంతా దోచేస్తున్నారని, పోలవరం మట్టితో కోట్లు కొల్లగొడుతున్నారన్నారు. నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో అవినీతికి పాల్పడుతున్నారని, సస్పెండ్ అయిన ఐటిడిఎ పిఒ సూర్యనారాయణతో అవినీతి చేశారన్నారు. టి.నరసాపురం సొసైటీలో ఎంఎల్‌ఎ బినామీలు రూ.120 కోట్లు అవినీతి చేశారన్నారు. టిడిపి అధికారంలోకొచ్చాక ముక్కుపిండి వసూలు చేస్తామన్నారు. జగన్ టిడిపి కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు ఎక్కువ ఉంటే అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తామన్నారు.










