అర్బిట్రేషన్ పిటీషన్లపై తీర్పొచ్చినా అమలు కాని దుస్థితి
ఇంకా పలు అర్బిట్రేషన్ పిటీషన్లపై తీర్పు కోసం రైతుల నిరీక్షణ
బహిరంగ మార్కెట్‌కు, ప్రకటించిన పరిహారానికి పొంతన కరువు
ఏళ్లు గడుస్తున్నా గ్రీన్‌ఫీల్డ్ రైతులకు దక్కని న్యాయం
అసెంబ్లీ సమావేశాల్లో ఎంఎల్‌ఎలు ప్రస్తావించేనా!
ప్రజాశక్తి - ఏలూరుప్రతినిధి
గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఏమాత్రం సరిపోదని, తమకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని రైతులు ఐదేళ్ల నుంచి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. పలు గ్రామాల్లో ఎకరాకు రూ.12.50 లక్షలు, మరికొన్నిచోట్ల ఎకరాకు రూ.17 లక్షలు, ఇంకొన్ని చోట్ల ఇంకోలా పరిహారం ప్రకటించిన పరిస్థితి ఉంది. బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.40 లక్షలకుపైగా పలుకుతున్న పొలాలకు అతితక్కువ పరిహారం ఇవ్వడాన్ని ఆది నుంచి రైతులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అదిగోఇదిగో అనడం మినహా రైతులకు న్యాయం చేసిన పరిస్థితి లేకుండాపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేసిన నేతలు ప్రస్తుతం ఎంఎల్‌ఎలుగా ఉండి తమ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి మండలాల్లోని 31 గ్రామాల మీదుగా వెళ్తోంది. ఈ గ్రామాల్లో మొత్తం 1100 ఎకరాల భూమిని రైతుల నుంచి తీసుకునేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. భూములు ఇవ్వడానికి తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని, న్యాయమైన పరిహారం ఇవ్వాలని రైతులు అడుగుతున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకుండాపోయింది. పనులను అడ్డుకోవడం నుంచి కలెక్టరేట్ వద్ద ఆందోళనలు వంటి ఎన్నో కార్యక్రమాలు రైతులు చేశారు. చివరికి జిల్లా కలెక్టర్ కోర్టులో ఆర్బిట్రేషన్ పిటీషన్ వేయడం సైతం జరిగింది.
తీర్పొచ్చినా ఆర్భిట్రేషన్ పిటీషన్లపై తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం
కొట్టు కనక నరసింహరావు, దేవులపల్లి
దేవులపల్లి గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్ హైవేకు భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ.12.50 లక్షలు ఇచ్చారు. పరిహారం పెంచాలని కలెక్టర్ కోర్టులో ఆర్బిట్రేషన్ పిటీషన్ వేశాం. ఇంకా తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం. రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం.äరం ఇవ్వల
కలెక్టర్ కోర్టు తీర్పును అమలు చేయాలి
కె.శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి
గ్రీన్‌ఫీల్డ్ హైవేకు భూములిచ్చిన రైతులు జిల్లా కలెక్టర్ కోర్టులో వేసిన ఆర్భిటేషన్ పిటీషన్లపై ఇచ్చిన జడ్జిమెంట్‌ను వెంటనే అమలు చేయాలి. పరిహారం పెంపు విషయంలో రైతులకు పెద్దగా న్యాయం జరగని పరిస్థితి ఉంది. బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.40 లక్షలు వరకూ పలుకుతోంది. గ్రీన్‌ఫీల్డ్ రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.ేదు
నల్లమోతు రవి, గ్రీన్‌ఫీల్డ్ బాధిత రైతు, చింతలపూడి
కలెక్టర్ కోర్టులో వేసిన ఆర్బిట్రేషన్ పిటీషన్‌కు సంబంధించి తీర్పు వచ్చి చాలా రోజులైంది. ముందుగా ప్రకటించిన ఎకరాకు రూ.17 లక్షల పరిహారానికి రూ.3.80 లక్షలు అదనంగా కలిపి ఇవ్వాలని తీర్పు వచ్చింది. ఇప్పటి వరకూ ప్రకటించిన పరిహారం ఇవ్వలేదు. ప్రకటించిన పరిహారం సైతం బహిరంగ మార్కెట్ ప్రకారం చాలా తక్కువే.
జిల్లా కలెక్టర్ కోర్టులోనూ దక్కని న్యాయం
పరిహారం విషయంలో న్యాయం చేయాలని చింతలపూడి ప్రాంత రైతులతోపాటు జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి వంటి గ్రామాలకు చెందిన రైతులు కలెక్టర్ కోర్టులో ఆర్భిట్రేషన్ పిటీషన్లు దాఖలు చేశారు. ఎట్టకేలకు చింతలపూడి ప్రాంత రైతులకు సంబంధించి పిటీషన్లపై తీర్పు సైతం వచ్చింది. గతంలో ప్రకటించిన రూ.17 లక్షల పరిహారానికి మరో రూ.3.80 లక్షలు కలిపి రూ.20.80 లక్షలు ఇచ్చేవిధంగా కలెక్టర్ కోర్టులో తీర్పు వచ్చింది. తీర్పు ఇచ్చి రోజులు గడుస్తున్నా ప్రకటించిన పరిహారం అమలుకు మాత్రం నోచుకోలేదు. ఇక్కడ ప్రకటించిన పరిహారంపైనా రైతులు తీవ్ర అసంతృప్తిలోనే ఉన్నారు. దేవులపల్లి గ్రామానికి సంబంధించి కలెక్టర్ కోర్టులో ఉన్న ఆర్బిట్రేషన్ పిటీషన్లపై తీర్పు కోసం రైతులు ఎదురుచూస్తూనే ఉన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో చింతలపూడి, పోలవరం ఎంఎల్‌ఎలు గ్రీన్‌ఫీల్డ్ తమ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.










