Jul 28,2023 21:32

మొక్కలను నాటుతున్న కలెక్టర్‌ సతీమణి

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : పట్టణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పరిసరాల్లో మొక్కలను నాటి గ్రీన్‌ ఆంధ్రా - గ్రీన్‌ పార్వతీపురం కార్యక్రమం విజయవంతం చేయాలని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అన్నారు. గ్రీన్‌ ఆంధ్రా - గ్రీన్‌ పార్వతీపురం కార్యక్రమం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం వద్ద అటవీశాఖ శుక్రవారం నిర్వహించింది. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ దంపతులు పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కల ఆవశ్యకత ఉందన్నారు. మొక్కలు ఎక్కువగా నాటాలని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తున్నాయని తద్వారా భావితరాల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని, ప్రకృతిని పరిరక్షించుకోవాలని తద్వారా వాతావరణ సమతౌల్యం వస్తుందని చెప్పారు. మొక్కలు నాటి పార్వతీపురం పట్టణాన్ని పచ్చదనానికి నిలయం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి జి.ఎ.పి.ప్రసూన, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి.వాగ్దేవి, తదితరులు పాల్గొన్నారు.
డోకిశీల గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలలో...
మొక్కలు పెంచడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించి తద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని డోకిశీల గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవిందరావు అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలోనూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మైదానంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే భావితరాలు ఇబ్బందులకు గురి అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంరక్షకుడు రమేష్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ మంతెన వాసు, పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ నవీన్‌ కుమార్‌, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.