Nov 23,2022 00:01

బిఆర్‌టిఎస్‌ రోడ్డులో పర్యటిస్తున్న జివిఎంసి కమిషనర్‌ రాజాబాబు

ప్రజాశక్తి - ఆరిలోవ : బిఆర్‌టిఎస్‌ రోడ్డుకు ఆనుకొని ఉన్న గ్రీన్‌ బెల్ట్‌ను ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని టౌన్‌ప్లానింగ్‌ ఎసిపి శాస్త్రిని జివిఎంసి కమిషనర్‌ పి.రాజాబాబు ఆదేశించారు. 12వ వార్డు పరిధి బిఆర్‌టిఎస్‌ రోడ్డు ఆరిలోవ, చినగదిలి, సంతపాలెం తదితర ప్రాంతాల్లో వార్డు కార్పొరేటర్‌ అక్కరమాని రోహిణితో కలిసి మంగళవారం ఆయన పర్యటించారు. గ్రీన్‌ బెల్ట్‌ను ఆక్రమించి ఏర్పాటుచేసిన చెత్త కొనుగోలు చేసే దుకాణాలను టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది తొలగించారు. ముడసర్లోవ జివిఎంసి నర్సరీలో ఒక పక్క అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌సెంటర్‌ను, మరోపక్క మహిళా పార్కు ఏర్పాటు చేయాలని వార్డు కార్పొరేటర్‌ అక్కరమాని రోహిణి కమిషనర్‌ను కోరారు. కంపోస్టు యార్డు ఎదురుగా ఉన్న ఆటస్థలం చుట్టూ ప్రహరీ, వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించాలని, శ్రీకాంత్‌నగర్‌లో ఉన్న ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేయాలని కమిషనర్‌ను కోరారు. కమిషనర్‌ స్పందిస్తూ అంచెలంచెలుగా ఆయా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ శాస్త్రి, ఎఎంఒహెచ్‌ డాక్టర్‌ ఎ.కిశోర్‌, కార్యనిర్వాహక ఇంజినీరు మత్స్యరాజు, డీడీ ఎం.దామోదరరావు, సహాయక కమిషనర్‌ పి.రమేష్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.