- సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు
- కలెక్టరేట్ వద్ద పంచాయతీ కార్మికుల ధర్నా
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, ఇతర కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఎపి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.అరుణ్ కుమార్ విమర్శించారు. బకాయి వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పంచాయతీ కార్మికుల నియామకంలో టెండర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా ఎపి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు, గ్రీన్ అంబాసిడర్లకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 57, 132, 680 జిఒలను అమలు చేయాలని, టెండర్ల విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయాలని 010 ద్వారా వేతనాలు ఇవ్వాలన్నారు. గ్రామాలను పరిశుభ్రం చేస్తూ ప్రజారోగ్యం, పర్యావరణాన్ని కాపాడుతూ చాలీచాలని వేతనాలతో బతుకీడుస్తున్న కార్మికులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 551 జిఒ ప్రకారం పంచాయతీ కార్మికులకు గుర్తింపుకార్డులు, కనీస వేతనాలు, ఇపిఎఫ్, ఇఎస్‌ఐ, టెండర్ల విధానాన్ని అమలు చేయాలని చెప్పినా వాటిని అమలు చేయడం లేదన్నారు. కరోనా కాలంలో గ్రామ పంచాయతీ కార్మికులు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేశారని గుర్తుచేశారు. మోడీ ప్రభుత్వం కరోనాలో ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్‌లైన్ వర్కర్ల కుటుంబాలకు రూ.50 లక్షలు ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసినా ఇంతవరకు చెల్లించలేదన్నారు. ప్రభుత్వం గద్దెనెక్కి నాలుగేళ్లు అవుతున్నా గ్రామపంచాయతీ కార్మికులు ఆశలు తీర్చక పోగా ఇచ్చిన జిఓలను సైతం అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే చలో విజయవాడకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్‌కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో యూనియన్ నాయకులు పడాల ప్రసాదరావు, గూన కృష్ణారావు, సిహెచ్.నూకరాజు, ఎన్.ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.










