Aug 04,2023 22:00

కలెక్టరేట్‌ వద్ద బైఠాయించిన గ్రీన్‌ అంబాసిడర్లు, పంచాయతీ కార్మికులు;

 

ఆందోళన చేస్తున్న వారిన వెనక్కి నెడుతున్న పోలీసులు
ఆందోళన చేస్తున్న వారిన వెనక్కి నెడుతున్న పోలీసులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  బకాయి వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పంచాయతీ కార్మికుల నియామకంలో టెండర్‌ విధానాన్ని రద్దు చేయాలని, తొలగించిన కార్మికులను పనిలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యాన గ్రీన్‌ అంబాసిడర్‌ లు, పంచాయతీ కార్మికులు శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్‌ గేటు వద్ద బైటాయించి ఎవరినీ లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. 18 నెలలుగా వేతనాలు చెల్లించకపోతే ఎలా బతకాలను ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోకి వెళ్లి అధికారులకు తమ బాధను చెప్పుకునేందుకు కార్మికులు ప్రయత్నం చేయగా పోలీసులు విరుచుకుపడి సి ఐ టి యు నాయకులను అరెస్టులు చేసే ప్రయత్నం చేశారు. దీంతో కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాలు మధ్య తోపులాటలు జరిగాయి. దీంతో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు బి.సూర్యనారాయణ, మద్ధిల రమణను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెల్లి పోలీసు వ్యానులో ఎక్కించి అరెస్టు చేశారు. దీంతో కార్మికులు పోలీసు వ్యానును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారిని పక్కకు నెట్టి సిఐటియు నాయకులను స్టేషన్‌ కు తరలించారు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు సిఐటియు జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ నాగలక్ష్మి పోలీసుల ద్వారా ధర్నా చేస్తున్న కార్మిక సంఘం నేతలను లోపలికి రావాలని కబురు పంపించారు. దీంతో ఆరుగురు సభ్యులతో వి.లక్ష్మి వెళ్లి కలెక్టర్‌కు సమస్యను వివరించారు. స్పందించిన కలెక్టర్‌ ఈనెల 15 తేదీ లోగా కార్మికులు వేతనాలు చెల్లిస్తామని, తొలగించిన కార్మికులందరినీ పనిలోకి తీసుకుంటా మని, పంచాయతీల్లో టెండర్‌ ద్వారా కార్మికులను తీసుకునే విధానాన్ని రద్దు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.
అంతకు ముందు కలెక్టరేట్‌ ముట్టడిని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి, ఉపాధ్యక్షులు బి.సూర్య నారాయణ, గ్రీన్‌ అంబాసిడర్‌ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిల రమణ మాట్లాడారు. రాష్ట్రంలో పోరాడి సాధించుకున్న జీవోలను అమలు చేయాలని హైకోర్టు తీర్పునిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయాలని, ప్రతి కార్మికుడికి పదివేల రూపాయలు వేతన ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 6 నెలల నుంచి 18నెలల వరకు ఉన్న బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని, 2015లో హైకోర్టు ఇచ్చిన తీర్పురాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులకు టెండర్‌ తో సంబంధం లేకుండా కార్మికులను కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకుండా నెలల తరబడి వెట్టి చాకిరీ చేయించుకుటోందన్నారు.

 సిఐటియు నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు
సిఐటియు నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు
 సిఐటియు నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు
సిఐటియు నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు


రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లోను పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మాత్రమే రూ.18వేలు వేతనం అనడం ఎంతవరకు సబబు అన్నారు. పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులదరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి విధుల్లో కొనసాగించాలని, కనీస వేతనం 26వేలకు తగ్గకుండా ప్రభుత్వం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు దండి శ్రీనివాస్‌, సిఐటియు నాయకులు బి.శ్రీను. పారిశుధ్య కార్మికుల సంఘం నాయకులు బోని రామారావు, తోటయ్య, కామేష్‌ ,సిహెచ్‌ అప్పారావు జిల్లా నుంచి తరలి వచ్చిన కార్మికులు పాల్గొన్నారు.