ప్రజాశక్తి- అనకాపల్లి : ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష- సహిత విద్యా విభాగం, హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించిన గ్రహణం మొర్రి, గ్రహణ శూల వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. స్థానిక గవరపాలెం గౌరీ గ్రంథాలయంలో గురువారం జరిగిన ఈ శిబిరంలో 26 మంది వికలాంగ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వీరులో 13 మందికి ఉచితంగా శస్త్ర చికిత్సలు హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో ఈనెల 20న నిర్వహిస్తామని ఆ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ముకుంద రెడ్డి తెలిపారు. రవాణా ఛార్జీలు కూడా తమ ఆసుపత్రి భరిస్తుందన్నారు. ఇదే ఆపరేషన్ ప్రైవేట్ గా చేయించుకుంటే రూ.80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ శస్త్ర చికిత్సలు ఎంత తక్కువ వయసులో చేయించుకుంటే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో 24 మండలాల ప్రత్యేక ఉపాధ్యాయులు, వికలాంగ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.










