Sep 16,2023 18:57

ప్రజాశక్తి - పాలకోడేరు
           ప్రతిఒక్కరూ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని, తద్వారా మంచి ఆరోగ్యం దరిచేరుతుందని ఐసిడిఎస్‌ పీడీ బి.సుజాతరాణి అన్నారు. శృంగవృక్షం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పోషకాహార మాసోత్సవం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు తయారుచేసిన పోషకాహార పదార్థాలను పీడీ సుజాతరాణి పరిశీలించి మాట్లాడారు. నెలరోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో పోషకాహారం ఆవశ్యకతపై వివిధ రూపాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. సర్పంచి జంగం సూరిబాబు మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్నారు. ఆకివీడు ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ సిడిపిఒ వి.వాణి విజయరత్నం మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారించి ఆహారాన్ని తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి సోడాదాసి నరేష్‌, సూపర్‌వైజర్లు పార్వతి, బాలకుమారి, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
         ఆచంట :ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని ఆచంట మండల సర్పంచుల ఛాంబర్‌ అధ్యక్షులు సుంకర సీతారామ్‌ కోరారు. మండలంలోని కొడమంచిలిలో రైతు కమ్యూనిటీ హాలులో కొడమంచిలి క్లస్టర్‌ పరిధిలోని వేమవరం, పెదమల్లం, కోడేరు, కందరవల్లి గ్రామాలకు చెందిన అంగన్‌వాడి కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. గర్భిణులకు, బాలింతలకు బాలామృతం, పాలు, గుడ్లు పోషకాహర పదార్థాలు అందించారు. సుంకర సీతారామ్‌ మాట్లాడుతూ క్లస్టర్‌ పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్తలు వివిధ వంటలు తయారు చేసుకుని ప్రదర్శించడం అభినందనీయమని కొనియాడారు. వంటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గోవర్ధన్‌, వైసిపి నేత పి.వనమారాజు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ శ్యామలాంబ, అంగన్‌వాడీ కార్యకర్తలు పొలిశెట్టి దుర్గాభవాని, సల్లపూడి సుజాత, కలగట కనకదుర్గ, కోట రజిని, సల్లపూడి సుజాత, పెచ్చెట్టి శోభరాణి, వై.రాఘవమ్మ, సిహెచ్‌.గౌరీశ్వరి, జి.వెంకటరమణ పాల్గొన్నారు.
           గణపవరం : గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రం ద్వారా అందించే పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కేశవరం సర్పంచి మిడతాని కామేశ్వరి నాగేశ్వరరావు అన్నారు. పోషకాహార మాసోత్సవాల సందర్భంగా తాడేపల్లిగూడెం ఐసిడిఎస్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని తీసుకుంటే తల్లీ బిడ్డ క్షేమంగా ఉంటారన్నారు. ఎ.గోపవరం సెక్టార్‌ సూపర్‌వైజర్‌ జి.చంద్రావతి మాట్లాడుతూ పోషకాహార మాసోత్సవాల సందర్భంగా సెక్టార్‌ పరిధిలోని అన్ని గ్రామాల్లో కూడా సమావేశాలు నిర్వహించి గర్భిణులకు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్ల రాజుపేట, జల్లి కాకినాడ, అప్పన్నపేట గ్రామాలకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు ఎంఎల్‌హెచ్‌పి జె.జ్యోతి, హెల్త్‌ అసిస్టెంట్లు ఆదినారాయణ, ఆశావర్కర్‌ సుమలత పాల్గొన్నారు.
          మొగల్తూరు : మండలంలోని కాళీపట్నం గ్రామంలో ఉన్న సెయింట్‌ మేరీస్‌ ఉన్నత పాఠశాలలో పోషకాహార మాసోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని కిశోర బాలికలకు పౌష్టికాహారంపై, బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్‌ మోజేష్‌, ప్రిన్సిపల్‌ శాంతి, అంగన్‌వాడీ టీచర్లు సారమ్మ, సరోజిని, గౌతమి, పార్వతి, జ్యోతి ప్రభ, మను పాల్గొన్నారు.