ప్రజాశక్తి-విశాఖపట్నం : వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణి, బాలింతలకు కార్పరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్యం అందించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.మల్లికార్జున చెప్పారు. బుధవారం ఉదయం ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆసుపత్రికి నూతనంగా మెటర్నీటి ఓటి, సిసి కెమెరాల ఏర్పాటు, ఆసుపత్రి భవన మరమత్తులకు, కారు పార్కింగ్ షెడ్డుల నిర్మాణం, ఇంటర్నల్ రోడ్సు నిర్మాణం, అదనపు మరుగుదొడ్లు నిర్మాణం, జనరేటరు నిర్వహణ షెడ్డు నిర్మాణం తదితర అంశాలపై ప్రతిపాదనలు తయారుచేసి నివేదిక సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
మరో విభాగంలో నూతనంగా నిర్మిస్తున్న 20 పడకల ఎసి షెడ్డును కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి రెండు వారాలలో వాడుకలోకి తీసుకురావాలన్నారు. కిటికీలకు దోమతెరలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలో ఇటీవల పేషంట్ల కోసం ఏర్పాటు చేసిన వసతి గదులను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రోగులతో మాట్లాడారు. సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కె.విజయలక్ష్మి, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జి.బుచ్చిరాజు, ఎన్జీవో అండ్ సోషల్ వర్కర్ ప్రెసిడెంట్ ఆర్.రవికుమార్ పాల్గొన్నారు.










