Jul 14,2023 02:12
వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష జరుపుతున్న జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా, చిత్రంలో డిఎంహెచ్‌ఒ విజయమ్మ

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: గర్భిణుల్లో రక్తహీనత, పోషణలోపం నివారణకు వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ పి రంజిత్‌ బాషా ఆదేశించారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహిం చారు. వైద్యాధికారుల తమ పనితీరు మార్చుకోవాలని కలెక్టర్‌ హెచ్చరించారు. గర్భిణులు పోషణ లోపంతో బాధపడు తుంటే వైద్యాధికారులు సక్రమంగా పరీక్షలు నిర్వహించక పోవడం ఏమిటని నిలదీశారు. జిల్లాలో 6,920 మంది గర్భిణులు పోషణలోపంతో బాధపడు తుంటే వైద్యులు ఏమి చేస్తున్నారన్నారు. 471 మంది గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు చేయకపోవడంపై సంబంధిత వైద్య అధికారులను నిలదీశారు. మీ కుటుంబం లోని వ్యక్తులు గర్భిణులుగా ఉంటే మీరు వైద్య పరీక్షలు చేయించరా... అంటూ వారిని ప్రశ్నించారు. గర్భిణులకు రక్తహీనత పరీక్షలు ప్రతినెల క్రమం తప్పకుండా నిర్వహిం చాలని కలెక్టర్‌ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల పనితీరుపై వైద్యాధికారుల పర్యవేక్షణ లోపించిందన్నారు. పరీక్షల నిర్వహణలో నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న వైద్యాధికారులకు షోకాజ్‌ నోటీస్‌లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆరోగ్య పరిస్థితిపై సర్వే సకాలంలో ముగించాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ప్రజల ఆరోగ్య పరిస్థితి బాధ్యత సంబంధిత వైద్యాధికారులదేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతినెల వైద్య పరీక్షలపై పర్యవేక్షణ సక్రమంగా ఉండాలని చెప్పారు. ప్రజలకు ఆరోగ్యం అందించడంలో వైద్యాధికారులు కీలకపాత్ర పోషించాల న్నారు. పోషణ లోపం, రక్తహీనత నివారణకు వైద్యాధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల మేరకు అధికారులు పనిచేయాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాలలో వైద్యాధికారులు పరిశీలన తక్కువగా ఉండడంపై ఆరా తీశారు. సచివాలయాల పరిధిలో వైద్య పరీక్షలు పక్కాగా నిర్వహించాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను గుర్తించి సకాలంలో వైద్యం అందించాలని ఆయన చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని బాపట్ల జిల్లాలో సమర్థంగా నిర్వహించాలన్నారు. వైద్యాధికారులలో సమన్వయం లోపించిందని, లోపాలను సరి చేసుకోవాలని అన్నారు. సాంకేతిక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసుకొని వైద్య ఆరోగ్య శాఖలో అమలవుతున్న యాప్‌ల పనితీరుపై పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎన్‌సిడిసి స్క్రీనింగ్‌ సర్వే వేగంగా చేపట్టాలని చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్‌ ఎస్‌ విజయమ్మ, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.