ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఆరోగ్యశ్రీ పథకంలో నూతనంగా చేర్చిన ఆల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్‌లను గర్భిణులకు ఉచితంగా చేస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. అన్ని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఈ సదుపాయం ఉంటుందన్నారు. గుంటూరు వేదాంత ఆసుపత్రిలో పరికరాలను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఆల్ట్రాసౌండ్, టిఫా స్కాన్స్ ప్రతి గర్భిణీకి ఉపయోగ పడుతుందని, ప్రైవేటుగా చేయించుకునే ఈ పరీక్షలు ఇక రూపాయి ఖర్చు లేకుండా చేయించుకొచ్చునని అన్నారు. టిడిపి హయాంలో 1059 రోగాలే ఆరోగ్యశ్రీ జాబితాలో ఉండగా వైసిపి ప్రభుత్వం 3257 చికిత్సలను చేర్చినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా 2022-23లో రూ.3,400 కోట్ల పైగా ఖర్చు చేశామని, 2.32 లక్షల కాన్పులు ఉచితంగా చేశామని తెలిపారు. కేవలం గర్భిణులకు చికిత్స అందించేందుకే రూ.247 కోట్లు వెచ్చించామన్నారు. నాడు-నేడు కింద గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్)కు రూ.500 కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ.40 కోట్ల పనులు పూర్తయినట్లు తెలిపారు. ఎంసిహెచ్ బ్లాక్ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ నివాస్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో తొలిసారిగా ఇన్ పేషంట్‌గా లేకున్న అవుట్ పేషంట్లకు స్కాన్ చేయించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ప్రసవం జరిగిన వెంటనే రూ.5 వేలను బాలింతల ఖాతాలకు జమ చేయడంతోపాటు ఐసిడిఎస్ ద్వారా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ కిట్‌ల పౌష్టికాహారం, చిన్నారులకు బాలమృతం అందిస్తున్నారన్నారు. వీటికి అయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 25 శాతం మాత్రమే అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం భరిస్తోందని చెప్పారు. సిహెచ్‌సి, పిహెచ్‌సిల నుంచి హైరిస్క్ గర్భిణులను జిల్లా ఆసుపత్రులకు ఉచితంగా తరలించేందుకు అయ్యే రవాణా ఖర్చుల కోసం నిధులను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా అల్ట్రాసౌండ్, టిఫా స్కాన్ గర్భిణులకు ఉచితంగా అందించే కార్యక్రమానికి సంబంధించి ప్రచార పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సిఇఒ హరింధర ప్రసాద్, ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్, జిడిసిసి బ్యాంకు చైర్మన్ ఆర్.సీతారామంజనేయులు, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయరు సజీలా పాల్గొన్నారు.










