ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : స్థానిక గర్భిణుల వసతి గృహాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బగాది జగన్నాథరావు బుధవారం తనిఖీ చేశారు. వసతి గృహంలోని గర్భిణులతో మాట్లాడి వారికి అందుతున్న ఆహార పదార్థాలు, వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణుల హెమోగ్లోబిన్ స్థాయిలు పరిశీలించారు. పౌష్ఠికాహారం కిట్ల వినియోగం తనిఖీ చేశారు. నాలుగు, ఐదవ కాన్పుల కోసం ఉన్నవారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు వారికి సరైన పోషణ కష్టమవుతుందని దాన్ని ఆలోచించాలని సూచించారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉండటం వల్ల వారి ఆరోగ్యం, విద్య, పెంపకం పట్ల ఆర్థిక భారంతో ఉన్న కుటుంబాలకు మరింత భారం కావచ్చని ఆయన చెప్పారు. కావున కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకోవాలని ఆయన సూచించారు. అలాగే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతం చేయాలని కోరారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించే గ్రామ పంచాయితీలలో వైద్య శిబిరాలు విధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య శిబిరాలలో ఓపి కనీసం 50 ఉండాలని, సికిల్ సెల్ ఎనీమియా సందేహస్పదంగా ఉన్న వారిని పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. జెఎస్‌వై, పిఎంవై పథకాలు కింద రెండో కాన్పులో బాలిక జన్మిస్తే ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు. గిరిజన ప్రాంత ప్రజలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, వాటిని వెంటనే అప్‌లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు. హై రిస్క్ గర్భిణీలను గుర్తించాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో డెప్యూటీ డిఎంహెచ్‌ఒ శివకుమార్, నోడల్ అధికారులు ఎం.వినోద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.