Jul 22,2023 22:06

గర్భిణులకు అవగాహన కల్పిస్తున్న డిఐఒ జగన్మోహన్‌

మక్కువ: గర్భిణులు, కిశోర బాలికలు, ఐదేళ్లలోపు పిల్లల్లో రక్తహీనత నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ టి.జగన్మోహనరావు సూచించారు. శనివారం ఆయన వెంకటబైరిపురాన్ని ఆకస్మికంగా సందర్శించారు. గర్భిణుల గృహ సందర్శన చేసి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య వివరాల నమోదుపై సిబ్బందిని ఆరా తీశారు. ప్రతినెలా గర్భిణులకు అందిస్తున్న ఐరన్‌, కాల్షియం మాత్రలు సక్రమంగా ఎమ్సిపికార్డ్‌లో విధిగా నమోదు చేయాలని, సిబ్బందికి సూచించారు. అలాగే గర్భిణులు వాటిని వినియోగిస్తున్న విధానంపై ఎప్పటికప్పుడు సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. అలాగే ఎంత మంది ఐదేళ్లలోపు పిల్లలకు ఐరన్‌ సిరప్‌ వేస్తుందని, ఆ వివరాల నమోదుపై డిఐఒ ఆరా తీశారు. ఇళ్ల వద్ద ఐరన్‌ సిరప్‌ లభ్యతపై తల్లిదండ్రులను అడిగారు. వారానికి రెండు సార్లు క్రమం తప్పకుండా ఐరన్‌ సిరప్‌ 6 నెలల నుండి ఐదేళ్లలోపు పిల్లలకు వైద్య సిబ్బంది వేయించాలన్నారు. ఆశా మొబైల్‌ అప్లికేషన్స్‌లో నమోదు వివరాలు పరిశీలించారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన హీమోగ్లోబిన్‌ రక్త పరీక్షల నిర్వహణను డిఐఒ పర్యవేక్షించారు. హీమోగ్లోబిన్‌ శాతం నమోదు వివరాలు పరిశీలించి తక్కువగా గుర్తించిన విద్యార్థులతో మాట్లాడి రక్తహీనత లక్షణాలు పరిశీలించారు. క్రమం తప్పకుండా ఐరన్‌ మాత్రలు వేసుకోవాలని, పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కిశోర బాలికల్లో రక్తహీనత నివారించే దిశగా వైద్య సిబ్బంది, ఉపాధ్యాయ సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎమ్‌ ప్రభాకర్‌, సూపర్‌ వైజర్‌ జయగౌడ్‌,వైద్య సిబ్బంది భారతి,విజరు కుమార్‌,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం
జిల్లాలో యువ పర్యాటక క్లబ్‌కు శ్రీకారం చుట్టారు. పర్యాటక ప్రదేశాలకు బహుళ ప్రాచుర్యాన్ని కల్పించడం తద్వారా పర్యాటక ప్రదేశాల విశేషాలు విద్యార్థులకు తెలియజేసి పిల్లల్లో నైపుణ్యం, పరిశుభ్రత, వివిధ కార్యక్రమాలు చేయడంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు యువ పర్యాటక క్లబ్‌లు దోహదపడతాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ విద్యాసంస్థలలో ప్రారంభించాలని సూచించడం, ఆ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడం జరిగింది. ఇందులో భాగంగా శనివారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో యువక్లబ్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం బి.భీముడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మన పండగలు, జాతరలు, కళారుపాలపై ప్రస్తుతం యువతకు, భావితరాల వారికి తెలియజేసేందుకు నేటి యువత వాటిపై డాక్యూమెంట్‌ చేసి అవగాహన పెంపొందించు కోవాలన్నారు. యువ క్లబ్బుల వల్ల విద్యార్థులకు నైపుణ్యం పెంపొందుతుందన్నారు. యువ క్లబ్‌ల ఆవశ్యకత వివరించారు. జిల్లాలో పలు పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యత వివరించారు.విద్యార్థినీ విద్యార్థులు వేసవి సెలవుల్లో వివిధ పర్యాటక ప్రదేశాలను పర్యటించి వీడియోగ్రఫీ చేయడం, జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలను గుర్తించి వాటి చరిత్ర ఫోటోలను జతపరిచి ఒక డాక్యూమెంట్‌ తయారు చేయాలని సూచించారు. యువక్లబ్‌లు ఇందుకు బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లా పర్యాటక అధికారి ఎన్‌.నారాయణ రావు పర్యాటక యువ క్లబ్‌ ఏర్పాటును అభినందించారు. అన్ని విద్యా సంస్థలలో ఏర్పాటుకు చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.మురళీధర రావు, ఎ.సూర్య ప్రకాశరావు, జి.శ్రీహరి, ఎన్‌.త్రినాథరావు, బి.కూర్మారావు, కె.చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.