ప్రజాశక్తి - పార్వతీపురం : గర్భిణీల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నిశాంత్ కుమార్ వైద్యాధికారులను హెచ్చరించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు సంభవించిన మాతృ మరణాలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సమీక్షకు మాతా, శిశు ఆరోగ్య రాష్ట్ర అదనపు సంచాలకులు డాక్టర్ కెవిఎన్‌ఎస్ అనిల్ కుమార్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ హనుమంతరావును నియమించారు. ఈ మేరకు మొండెంఖల్లు, దుడ్డుఖల్లు, జియ్యమ్మవలస, ఆర్‌ఆర్ బి పురం, మక్కువ, తోణాం పిహెచ్‌సి పరిధిలో సంభవించిన మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించారు. అందుకు కారణమైన అంశాలపై, అందజేసిన వైద్య సేవలపై ఆయా వైద్యాధికారులు, వైద్య సిబ్బందిని అదేవిధంగా రిఫరల్ ఆసుపత్రిలో వైద్యులు అందజేసిన చికిత్సపై ఆరా తీశారు. ఏ విధమైన ప్రమాదకర సూచికలు మరణాలకు కారణమయ్యాయి విశ్లేషించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆశా కార్యకర్త నుండి జిల్లా అధికారి వరకు వారి పరిధిలో ఉండే గర్భిణీలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రమాదకర సూచికలు గుర్తించిన వెంటనే నివారణా చర్యలు చేపట్టి, అందుకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు వినియోగించాలని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాన్పు సమయం దగ్గర పడుతున్న కొద్దీ హైరిస్క్ గర్భిణీ కాకపోయినప్పటికీ ఆ సమయంలో ఏవైనా ప్రమాదకర సూచికలు ఉన్నాయా అని గుర్తించడం చాలా ముఖ్యమని, అందుకు అవసరమైన పరిజ్ఞానం ప్రతి వైద్య సిబ్బందికి ఉండాలని ఆయన అన్నారు. అవసరమైన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆదేశించారు. సమావేశంలో సీతంపేట, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులు కల్పనాకుమారి, విష్ణుచరణ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి. జగన్నాథరావు, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ బి. వాగ్దేవి, జిల్లా ఆర్బిఎస్ కె అధికారి డాక్టర్ ధవళ భాస్కరరావు, నోడల్ అధికారి డిఐఒ డాక్టర్ టి.జగన్మోహనరావు, ప్రోగ్రాం అధికారి డాక్టర్ వినోద్, డిప్యూటీ డిఎమ్ హెచ్‌ఒ లు డాక్టర్ విజయపార్వతి, డాక్టర్ వెంకటరమణ, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ నవీన్ , డాక్టర్ శ్యామ్ కుమార్, వివిధ ఆసుపత్రుల స్పెషలిస్ట్ వైద్యులు, మాతాశిశు ఆరోగ్య కన్సల్టెంట్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.










