ప్రజాశక్తి -గరుగుబిల్లి : ప్రసవ సమయం దగ్గర పడుతున్న గర్భిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు సూచించారు. ఈ మేరకు ఆయన స్థానిక పిహెచ్‌సిలో పిఎంఎస్‌ఎంఎ కార్యక్రమాన్ని శనివారం పరిశీలించారు. వైద్య సిబ్బంది గర్భిణులకు చేపడుతున్న ఆరోగ్య తనిఖీలు, రక్త పరీక్షలు ఆయన పరిశీలించారు. ఎంత మంది గర్భిణీలకు తనిఖీలు చేపట్టారు. వీరిలో ఎంత మందిని హైరిస్క్‌గా గుర్తించారు, కాన్పు సమయం దగ్గరగా ఉన్న వారు ఎంత మంది, అరుదుగా ఉన్న బ్లడ్ గ్రూప్‌తో ఎంత మంది ఉన్నారు తదితర అంశాలపై సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం ఆయన ఆసుపత్రికి వచ్చి గర్భిణీల ఆరోగ్యం పరిశీలించారు. అనంతరం వారితో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. వారి వద్ద ఉన్న మాతా శిశు సంరక్షణ కార్డులను పరిశీలించి వివరాల నమోదుకు సంబంధించి వైద్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. సాధారణ ప్రసవాలన్నీ పిహెచ్‌సిలో జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహనరావు మాట్లాడుతూ గర్భస్థ పిండం ఎదుగుదల తీరు, లోపాలను గుర్తించేందుకు జరిపే టిఫ్ఫా స్కానింగ్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు. హై రిస్క్, రక్త హీనత గర్భిణీలను ఆసుపత్రికి చేర్చేందుకు తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనం అందుబాటులో ఉందన్నారు. అలాగే పిఎమ్‌ఎమ్ వివై, జెఎస్ వై, ఆరోగ్య ఆసరా మొదలగు సంక్షేమ పథకాలున్నాయని, గర్భిణీల ఆరోగ్య శ్రేయస్సుకై ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని ఆరోగ్య సేవలు పూర్తి స్థాయిలో నిర్వహించాలని సూచించారు. అనంతరం ఆయన సత్యసాయి ట్రస్ట్ వారు గర్భిణులకు ఉచితంగా ఏర్పాటు చేసిన పౌష్ఠికాహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, సూపర్ వైజర్లు చిన్నమ్మి, ఉదయ కుమారి, ప్రసాద్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఉన్నారు.
గర్భిణీలకు వైద్య తనిఖీలు
వీరఘట్టం:్ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని శనివారం వైద్యాధికారి పి.ఉమామహేశ్వరి గర్భిణులకు వైద్య తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎత్తు, బరువు తదితరమైన తనిఖీలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి సురక్ష మాతృ అభియాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఒ.శాంతి కుమారి, ఎఎన్‌ఎంలు, ఆవా కార్యకర్తలు, గర్భిణీలు పాల్గొన్నారు.










