ప్రజాశక్తి-పాడేరు:అంగన్వాడీ కేంద్రాలకు రాలేక పోయిన గర్భిణీలు, బాలింతలకు వారి ఇంటికే పౌష్టికాహారం పంపించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాడేరు నియోజక వర్గం పరిధిలోని ఐసిడిఎస్ అధికారులు, మహిళా పోలీస్‌లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్వాడి సూపర్వైజర్లు, ఆయాలు, హేల్పర్లకు సచివాలయాల మహిళా పోలీస్‌లు సహకరించాలని సూచించారు. బరువు, ఎత్తు తక్కువున్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ కనపర చాలన్నారు. ఆరు నెలల నుండి 36 నెలల పిల్లలకు తప్పనిసరిగా పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రక్త హీనతతో బాధ పడుతున్న వారిని, హై రిస్క్ గర్భిణీలను గుర్తించి వారికి సరైన అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో అధికంగా మహిళా పోలీసులు ఉన్నందున గిరిజన గర్భిణీల, బాలింతల భాద్యతను తీసుకోవాలని సూచించారు. మాతా, శిశు మరణాల నివారణలో మహిళా పోలీస్‌ల పాత్ర కీలకమన్నారు. సచివాలయాలలో వాలంటీర్ల సహాయంతో ఇంటికి రేషన్ పంపించాలన్నారు. మహిళా పోలీసులు గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న సేవలపై రికార్డుల తనిఖీ చేస్తానని తెలిపారు.ఎండియు వాహనాల ద్వారా అంగన్వాడి కేంద్రాలకు రేషన్ సరఫరా చేయాలని, ఈ మేరకు తహసిల్దార్లకు ఆదేశాలు జారీ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేసారు. అంగన్వాడీ కేంద్రాలకు రాని పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులు, సర్పంచ్‌లతో మాటాడి వారిని రప్పించాలన్నారు.రాలేని పిల్లలకు పాలు, గుడ్లు పంపించాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బందికి క్రమ బద్ధీకరణ జరిగిందని, ఇప్పటికీ ఏమీ తెలీదని తప్పించుకోకుండా భాద్యతతో మెలగాలని హెచ్చరించారు.
ఐసిడిఎస్ పధక సంచాలకులు సూర్య లక్ష్మి మాట్లాడుతూ, సమస్యలుంటే స్థానిక సిడిపిఓ దృష్టికి తీసుకు వచ్చి పరిశ్కరించుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ సిడిపిఓలు, సూపెర్వైజర్లు, ఆయా మండలాల మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు.










