- ఈ సమయంలో 15 శాతం మహిళలపై ప్రభావం
- రమేష్ హాస్పిటల్స్ ఎండోక్రైనాలజిస్టు డాక్టర్ రాకేష్ బొబ్బా
- నేడు గర్భధారణ మధుమేహ దినోత్సవం
ప్రజాశక్తి-విజయవాడ అర్బన్
గర్భం ధరించి ఉన్న మహిళల్లో వచ్చే అనేక రకాల సమస్యల్లో గర్భధారణ మధుమేహం ఒకటని, దీనిపై ప్రతి మహిళా అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ రమేష్ హాస్పిటల్స్ ఎండోక్రైనాలజిస్టు డాక్టర్ రాకేష్ బొబ్బా అన్నారు. మార్చి 10న జాతీయ గర్భధారణ మధుమేహ దినోత్సవం (జెస్టేషనల్ డయాబెటీస్) సందర్భంగా ఆయన ప్రజాశక్తితో మాట్లాడారు. గర్భధారణ మదుమేహంపై డాక్టర్ వి.శేషయ్య చేసిన పరిశోధనలకు, అలాగే ఆయన చేసిన కృషికి గుర్తుగా ఆయన జయంతిని పురష్కరించుకుని జాతీయ గర్భధారణ మధుమేహ దినోత్సవంగా జరుపుతున్నట్లు చెప్పారు. గర్భం ధరించి ఉన్న మహిళల్లో ఎవరైతే రెండో లేదా మూడో ట్రైమిస్టర్‌లో షుగర్ వ్యాధి మొదటిసారిగా నిర్థారింపబడుతుందో దానిని గర్భధారణ మధుమేహం అంటారని తెలిపారు. గర్భం ధరించి ఉన్న మహిళల్లో వచ్చే అనేక రకాల సమస్యల్లో ఇది ఒకటని చెప్పారు. గర్భధారణ సమయంలో సుమారు 15 శాతం మహిళలపై ఇది ప్రభావం చూపుతుందన్నారు. చాలా సందర్భాల్లో ఈరకమైన మధుమేహం బిడ్డ పుట్టిన తరువాత పోతుందన్నారు. అయితే గర్భధారణ మధుమేహం ఉంటే కొన్నేళ్ల తర్వాత టైప్ -2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. జరాయువు హార్మోన్లు లేదా ప్రెగెన్సీ సమయంలో బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత వంటివి ఇది రావడానికి ప్రథమ కారణాలుగా చెప్పవచ్చని తెలిపారు. దీనిని ఓరల్ గ్లూకోజ్ టోలరెన్స్ టేస్ట్ (ఒజిటిటి ) అనే రక్త పరీక్ష ద్వారా సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. ముఖ్యంగా గర్భం ధరించి ఉన్న మహిళలు 24 నుండి 26 వారాల మధ్యలో ఈపరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఎవరిలో అయితే ఇది నిర్థారణ అవుతుందో వారికి మెడికల్ న్యూట్రిషనల్ థెరపీ అంటే వారి శరరీ బరువుకు తగినట్లు రోజుకు అవసరమైన క్యాలరీలను ఇవ్వాలన్నారు. అలాగే అవసరమైన వారిలో మెటార్మిన్ లేదా ఇన్సులిన్ వాడటం ద్వారా షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చని తెలిపారు. గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటిస్ వల్ల మహిళలు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా పుట్టబోయే శిశువు ఉండాల్సిన దానికంటే అధిక బరువుతో పుట్టడం, పూర్తిగా నెలలు నిండకుండానే ప్రసవించడం, ప్రసవం కష్టం కావడం, పుట్టిన వెంటనే శిశువుల్లో షుగర్ లెవల్స్ తగ్గిపోవం లేదా కాల్షియం లెవెల్స్ తగ్గడం వంటివి చూస్తామన్నారు. ఇది ఉన్నవారు ఇన్సులిన్‌ను వాడటం ఉత్తమమని, మాత్రలు వాడటం మంచిదికాదని అన్నారు. మాత్రలు శిశువుపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. కొంతమందిలో మెట్ఫార్మిన్ వంటి బేసిక్ మాత్రలే వాడవచ్చని తెలిపారు. ఎవరిలోనైతే గర్భధారణ సమయంలో షుగర్ వ్యాధి నిర్థారణ అవుతుందో వారు వెంటనే నిపుణులైన ఎండోక్రైనాలజిస్టు వద్ద చికిత్స తీసుకోవడం ద్వారా తల్లి, పుట్టబోయే శిశువు ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గర్భధారణ సమయంలో షుగర్ వ్యాధి వచ్చిన తల్లికి పుట్టిన పిల్లల్లో ఎక్కువ మంది జీవితాంతం షుగర్ వ్యాధితో లేదా అధిక బరువుతో బాధపడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులు నేర్పించడం ద్వారా, అలాగే శారీరక వ్యాయామం ప్రాముఖ్యత గురించి వివరించడం ద్వారా పుట్టిన పిల్లల్లో మధుమేహం, ఊబకాయం రాకుండా జాగ్రత్త పడవచ్చని తెలిపారు.










