Aug 10,2022 23:44

ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్న గ్రామస్తులు

ప్రజాశక్తి -ఆనందపురం : తర్లువాడ గ్రామ సమీపంలో ఉన్న చుక్క కొండపై గ్రావెల్‌ క్వారీకి అనుమతులు ఇవ్వరాదని గ్రామస్తులు బుధవారంనాటి ప్రజాభిప్రాయసేకరణలో కోరారు. తర్లువాడ పంచాయతీ సర్వే నెంబరు 211, 212 లో సుమారు 125 ఎకరాలు కొండను గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు ఇస్తూ 2017-18 కాలంలో పంచాయతీ సభ్యులు మైనింగ్‌ కాంట్రాక్టర్‌ రామరాజుకు తీర్మానం చేశారు. ఈ మేరకు మైనింగ్‌ అధికారులు శ్రీనివాస్‌మూర్తి, సుదర్శన్‌ నాయకత్వంలో బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. గ్రామంలో ఉన్న సుమారు రెండు వేలు మంది గ్రావెల్‌ క్వారీని వ్యతిరేకించారు. కొండపైన వెంకటేశ్వర స్వామి ఆలయం ఏర్పాటుకు అధికారులు ఇటీవల పరిశీలన చేపట్టారని కొండను తవ్వేస్తే పర్యావరణం దెబ్బతింటుందని స్థానికులు వివరించారు. గ్రామంలో ఉన్న పశువులు మేతకు కూడా ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. గ్రామంలో పాఠశాల భవనానికి సరైన స్థలం లేదని, భవిష్యత్తులో గ్రామస్తులకు సరిపడిన ఇళ్ల స్థలాలు, ఆట స్థలాలు గాని లేవని వివరించారు. కొండపై గ్రావెల్‌ క్వారీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని అధికారులను కోరారు. గతంలో చేసిన తీర్మానాలను రద్దుచేస,ి పర్యావరణాన్ని, గ్రామ పశుసంపదను కాపాడాలని గ్రామస్తులు, స్థానిక సర్పంచ్‌ బిఆర్‌బి నాయుడు, తెలుగుదేశం నాయకులు తాట్రాజు అప్పారావు అధికారులను కోరారు.
గ్రావెల్‌ క్వారీకి అనుమతులు వద్దంటూ గ్రామస్తులు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, జిల్లా పర్యావరణ ఇంజినీర్‌ సుదర్శన్‌, స్థానిక రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
నిబంధనలు లోబడే క్వారీ అనుమతులు : కాంట్రాక్టర్‌
ప్రభుత్వ నిబంధనలకు లోబడే క్వారీ అనుమతులు తీసుకున్నామని కాంట్రాక్టర్‌ రామరాజు తెలిపారు. పర్యావరణానికి, గ్రామానికి ఎలాంటి నష్టం కలగకుండా క్వారిని భూమి చదును చేస్తామని చెప్పారు. 200 అడుగులు లోతుకు క్వారీని చేపడతారని అపోహలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. పర్యావరణానికి, కాలుష్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్వారీ నిర్వహిస్తామని చెప్పారు.