Sep 01,2023 22:28

ఫొటో : మాట్లాడుతున్న పసుపులేటి సుధాకర్‌

గ్రావెల్‌ అమ్ముకుంటూనే బెదిరింపులు
ప్రజాశక్తి-కావలి : కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి ఒకవైపు అక్రమ గ్రావెల్‌ అమ్ముకుంటుంటే, అదేమని అడిగితే పోలీసులతో బెదిరిస్తున్నారని, ఏమి జరిగినా తాను తగ్గేదిలేదని పి.ఎస్‌.ఆర్‌. చారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత పసుపులేటి సుధాకర్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పట్టణంలోని పి.ఎస్‌.ఆర్‌. కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గత మూడురోజులుగా రుద్రకోట గ్రామంలో కేజీఎఫ్‌ -3 తరహాలో ఎం.ఎల్‌.ఎ గ్రావెల్‌ తవ్వేస్తున్నారన్నారు.
కావలి ఆర్‌డిఒ శీనానాయక్‌కు ఈ విషయంపై ఫిర్యాదు చేస్తే, తమకు సంబంధం లేదని అన్నారన్నారు. ప్రజలకి ఈ గ్రావెల్‌ మాఫియా గురించి తెలియజేయాలని వివిధ మార్గాల్లో ప్రచారం చేస్తున్నామన్నారు. అందులో భాగంగా గ్రావెల్‌ అక్రమ తరలింపుపై గోడపత్రికలు తయారు చేసి, అంటించామ్మన్నారు. వాటిని మున్సిపల్‌ కమిషనర్‌ అదేశాలతో పారిశుధ్య సిబ్బందితో తొలగింపజేస్తున్నారని తెలిపారు. పైగా పోలీసులతో బెదిరింపులు చేయిస్తున్నారన్నారు. పోలీసులు కూడా తనకు కాల్‌ చేసి చెప్పారని తెలిపారు. అలా కాకుండా పోలీసులని కార్యకర్తల్లా అడ్డుపెట్టుకుని బెదిరించడం, పోస్టర్లు చించేయడం దౌర్భాగ్యమన్నారు. ఆయన ఎన్నికల్లో అక్రమ మద్యం పంచి, సుకుమార్‌రెడ్డిని ఇరికించిన విషయం తెలుసన్నారు. తాను నేరుగా ఎదుర్కొంటున్నానని తెలిపారు. పోస్టర్లు అతికిస్తే తప్పు చేసామంటున్నారని అంటే గ్రావెల్‌ ఇలా తవ్వుతుంటే తప్పు కాదా అని ప్రశ్నించారు. ఈ ఎంఎల్‌ఎ 15వసంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడని, గ్రావెల్‌, ఇసుక తోలుకోవడం తప్ప ఏమి చేశారో చెప్పాలని, తన కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమన్నారు. గ్రావెల్‌ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు.