రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోండి
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ డిమాండ్
ప్రజాశక్తి- సబ్బవరం : మండలంలోని పైడివాడ, పౖౖెడివాడ అగ్రహారంలో గ్రావెల్ అక్రమ దందా వెనుక ఉన్న రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు.మంగళవారం పైడివాడ గ్రామంలో పర్యటించి, టిడిపి నేతలతో కలిసి గ్రావెల్ తవ్వకాలు జరిగిన క్వారీలను పరిశీలించారు.ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, పైడివాడలో వైసిపి నేత నేతృత్వంలో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతుంటే, అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దాసరి వెంకటరమణ, కొంతమంది స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని మూడు జెసిబిలు, ఆరు ట్రాక్టర్లను స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగిస్తే, ఎంఆర్‌ఐ వీరయ్య, విఆర్‌ఒ, ఇతర సిబ్బంది కొద్దిసేపటికే వాటిని వదిలేయడమే కాకుండా, తహశీల్దార్‌కు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయన్నారు. అందించినట్లు మీడియాలో మంగళవారం వార్తలు వచ్చాయని బండారు ఆరోపించారు.సర్వేనెంబరు 167లో గ్రావెల్ తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్నారని, దీంతో 138 సర్వే నెంబరులోని క్వారీలో తవ్వకాలను అడ్డుకునేందుకు ఎవరైనా వస్తే దాడులు చేసేందుకు కర్రలు సిద్ధం చేసి ఉంచారంటూ వాటిని చూపించారు. గొల్లలపాలెం పంచాయతీలో సర్వే నెంబర్1/1, 2/1, 2/6లలో ఆ గ్రామ వైసిపి నేతలు తవ్విన అక్రమ క్వారీలను పరిశీలించారు. జిల్లాకలెక్టర్, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, అక్రమ క్వారీలకు అడ్డుకట్ట వేయాలని లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని బండారు హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, ఎంపిటిసి సీరం అప్పలరాజు, పార్టీ మండల అధ్యక్షుడు మిడతాడ మహాలక్ష్మి నాయుడు, అనకాపల్లి పార్లమెంటరీ తెలుగు యువత అధ్యక్షుడు పిబివిఎస్‌ఎన్ రాజు, రేసుపూడి రమణ, గవర అప్పారావు, కోరాడ శ్రీను, రొంగలి దేముడు, దాసరి వెంకటరమణ అక్కిరెడ్డి దుర్గినాయుడు, బొబ్బరి కన్నారావు, గొంతిన పైడిరాజు, దాడి కన్నంనాయుడు, బొండా రాజు, గొల్లవిల్లి రమణ, అక్కుబాబు, వంగలపూడి సంతోష్, దాసరి ప్రసాద్ పాల్గొన్నారు.










