వలస వెళుతున్న ఆవులు
ప్రజాశక్తి-సంతమాగులూరు: ప్రకాశం జిల్లా, పుల్లలచెరువు మండలం, సుగాలీల తండాల నుంచి ఆవులు పశు గ్రాసం కోసం, వినుకొండ, సంతమాగులూరు, కోటప్పకొండ, చిలకలూరిపేట మీదుగా గుంటూరు జిల్లా తెనాలి వైపు తరలి వెళుతున్నాయి. పుల్లలచెరువు సమీపంలోని అడవులలో వేసవికాలంలో పశుగ్రాసం దొరకనందున, తెనాలి ప్రాంతం వైపు ఉన్న మాగాణి భూములలో ఆవులను మేత మేపుకునేందుకు వెళుతున్నట్లు ఆవుల పెంపకందారులైన సుగాలీలు తెలుపుతున్నారు. ఈ ఆవుల వెంట ఎడ్లబండ్లతో సుగాలీల కుటుంబాలు తరలి వెళుతున్నాయి. ఈ ఏడాది 20 వేల ఆవుల వరకు తెనాలి వైపు వలస వెళ్లినట్లు సుగాలీలు తెలుపుతున్నారు. మళ్లీ తొలకరిలో జూలై నెలలో తిరిగి స్వగ్రామాలకు ఆవులు చేరుకుంటాయని వారు చెప్పారు.










