అనంతపురం ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందన్న దానిపై అంచనాకు సర్వే బృందాలు దిగాయి. జనంలో పార్టీ గ్రాఫ్ ఏ రకంగా ఉందన్నది ఈ బృందాలు పరిశీలిస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరువేరుగా సర్వేలు కొనసాగుతున్నాయి. ఈ సర్వేల్లో ఏ రకంగా తమ పరిస్థితి ఉందన్నది గుబులు నేతల్లోనూ నెలకొంది. కొంతమంది నేతలు సర్వే బృందాలను ఏ రకంగా ప్రసన్నం చేసుకునే పనిలోనూ ఉన్నట్టు పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.
తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న జిల్లాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా ఉంది. 2019 ఎన్నికల్లో గతంలో ఎన్నడూలేనంతగా దెబ్బతింది. 14 నియోజకవర్గాల్లో 12 స్థానల్లో ఓటమి చెందింది. రెండు పార్లమెంటు స్థానాలనూ కోల్పోయింది. ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎదురు గాలే వీచింది. తాడిపత్రి పురపాలక సంఘం మినహా అన్ని మున్సిపాలిటీల్లోనూ ఓటమి చెందింది. గతంలో ఎన్నడూ ఇంతటి ఘోర ఓటమిని తెలుగుదేశం పార్టీ జిల్లాలో చవి చూడలేదు. ఒక రకంగా పార్టీ శ్రేణులు సైతం నైరాశ్యంలోకి వెళ్లాయి. ఇటువంటి తరుణంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. కొన్ని నెలల్లో ఎన్నికలూ జరగనున్నాయి. ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందన్న అంచనాలను వేసుకునే పనిలో ఆ పార్టీ అధిష్టానం పడింది. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు జైలుకెళ్లి వచ్చాక ఏమైనా గ్రాఫ్ పెరిగిందా..? లేదా..? అన్నది కూడా అంచనా వేస్తున్నారు. ప్రధానంగా మూడు బృందాలు జిల్లాలో సర్వేలు చేపట్టినట్టు సమాచారం. అందులో ఒకటి పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టగా మరొకటి ప్రజల్లో పార్టీ పరిస్థితి ఏరకంగా ఉందన్నది సర్వేల ద్వారా అంచనా వేస్తోంది. మరొకటి నేతలెవరైతే బాగుంటుందన్నది పరిశీలిస్తోంది. ఇప్పుడున్న నాయకుల పరిస్థితి ఏ రకంగా ఉంది. ..కొత్తగా ఎవరైనా అవుత్సాహికులున్నారా అన్నది కూడా పరిశీలిస్తున్నారు. కొత్త వారైతే వారి ఆర్థిక స్థితిగతులేమిటన్నది కూడా అంచనా వేసే పనిలోనున్నారు. సామాజిక తరగతుల వారీగానూ ఈ అధ్యయనం సాగుతోంది. ఈ రకమైన సర్వేలు నడుస్తున్న సమయంలో ఉన్న నేతలు తమ పట్టును నిరూపించుకునేందుకు సర్వే బృందాలను గుర్తించి వారి ద్వారా అనుకూలమైన నివేదికలను అధిష్టానానికి అందించే విధంగా చూసుకునే పనిలోనూ ఉంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇంకో వైపు అధికార వైసిపి కూడా తమ బలబలాతోపాటు, ప్రతిపక్ష పార్టీ బలహీనతలపైనా దృష్టి పెడుతోంది. ఆ పార్టీ కూడా ప్రభుత్వ, ప్రయివేటు సర్వేలను నిరంతరాయంగా చేపడుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగనున్నాయి. టిడిపి కూడా సర్వేల ద్వారా అభ్యర్థుల ఎంపికలను చేపట్టనుంది. గతంలోలాగా నేతల ఒత్తిళ్లపై కాకుండా సర్వేలపై ఆధారపడి ముందుకెళ్లే పరిస్థితి నెలకొనడంతో ఇప్పుడున్న నేతలు తిరిగి టిక్కెట్టును నిలబెట్టుకునేందుకు పావులు కదుపుతుండగా, కొత్త వారు కూడా తమ ఆర్థిక బలాన్ని చూపించి టిక్కెట్టును సాధించేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త, పాతల మధ్య పోటీ సైతం నెలకొంటోంది. సర్వేల నివేదికల ద్వారా అధిష్టానం ఎటువంటి అడుగులు వేస్తుందన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా టిడిపిలోనూ అప్పుడే ఎన్నికల కసరత్తు ఊపందుకుంటోంది. నేతల్లో కదలిక ఊపందుకుంటోంది.