ముగిసిన ఎపి వ్యకాస 29వ రాష్ట్ర మహాసభ
ఉత్తేజాన్నిచ్చిన ప్రదర్శన, బహిరంగ సభ
ప్రతినిధుల సభలో విస్తృత చర్చలు, సమీక్షలు
జాతీయ, రాష్ట్ర నేతల దిశానిర్దేశంతో నూతనోత్సాహం
22 తీర్మానాలు ఆమోదం : నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి, జంగారెడ్డిగూడెం
గ్రామస్థాయిలో కూలిపేటల్లో పేదలను సంఘటితం చేసి ఐక్య పోరాటాలు విస్తృతం చేయాలనే నినాదాల నడుమ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభ అత్యంత ఉత్తేజపూరిత వాతావరణంలో ముగిసింది. జంగారెడ్డిగూడెం శివార్లలో దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపంలో మూడు రోజులపాటు ఈ మహాసభ జరిగింది. తొలిరోజు గురువారం స్థానిక మార్కెట్ యార్డు నుంచి బస్టాండ్ వరకూ సాగిన ప్రదర్శన పట్టణవాసులను ఆకట్టుకుంది. అనంతరం జరిగిన బహిరంగ సభలో వేలాది మంది పేదలు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథులు గిరిజనోద్యమ జాతీయ నేత బృందాకరత్, వ్యకాస జాతీయ అధ్యక్షుడు విజయ రాఘవన్ సందేశాలు పేదలు, సంఘం నేతల్లో ఉత్తేజాన్ని నింపాయి. రెండో రోజు సంఘం సీనియర్ నేత పాటూరు రామయ్యచే సంఘ పతాకావిష్కరణతో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ప్రారంభ సభలో సంఘం జాతీయ అధ్యక్షులు విజయ రాఘవన్ స్రంగం ప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తూ సాగింది. ఈ సభలోనే పిడిఎఫ్ ఎంఎల్‌సిలు షేక్ సాబ్జీ, ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడారు. అనంతరం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు కార్యకలాపాల నివేదికను ప్రవేశ పెడుతూ రాష్ట్రంలో గత మూడేళ్లలో చేపట్టిన పోరాటాలు, సాధించిన విజయాలు మహాసభ ముందుంచారు. అలాగే వ్యవసాయ కార్మికులు ఈ కాలంలో ఎదుర్కొంటున్న సమస్యలు వివరిస్తూ సంఘం తరఫున చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను వివరించారు. దీనిపై 26 జిల్లాల నుంచి విచ్చేసిన ప్రతినిధులు చర్చించి నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించారు. అలాగే వ్యవసాయ కార్మికులతోపాటు పేదలు, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 22 తీర్మానాలను మహాసభలో విస్తృతంగా చర్చించి ఆమోదించారు. కేరళ వ్యవసాయ కార్మికుల సంక్షేమ బోర్డు చంద్రన్ ఆ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికుల స్థితిగతులు, పోరాటాలు వివరించారు. అక్కడ వామపక్ష ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు అమలు చేస్తున్న పథకాలు, తోడ్పాటు గురించి వివరించారు. మహాసభ జరిగిన తీరుపై ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో గ్రామాల్లో పేటలవారీ సంఘాన్ని బలోపేతం చేసి పోరాటాలు ఉధృతం చేయాలని దిశానిర్దేశం చేశారు. తోటి సంఘం బికెఎంయు రాష్ట్ర అధ్యక్షులు జె.విల్సన్‌తోపాటు కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్రు మాల్యాద్రి, రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామన్న, రైతుసంఘం రాష్ట్ర పూర్వ కార్యదర్శి వి.శ్రీనివాసరావు, వ్యకాస సీనియర్ నేత పి.సోమయ్య, మంతెన సీతారాం సౌహార్థ్ర సందేశాలిచ్చారు. ఆహ్వాన సంఘం తరఫున గౌరవాధ్యక్షులు మేకా ఈశ్వరయ్య, డాక్టర్ కె.వజ్ర కిరణ్, ఉపాధ్యక్షులు డాక్టర్ దండమూడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎ.రవి, వ్యకాస జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.జీవరత్నం, పివి.రామకృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ మహాసభకు అధ్యక్షవర్గంగా దడాల సుబ్బారావు, జి.ఈశ్వరమ్మ, ఎ.రవి, కె.నారాయణ, ఎం.పుల్లయ్య వ్యవహరించారు. చివరి రోజు శనివారం సాయంత్రం నూతన కమిటీ 79 మందితో ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఏలూరు జిల్లా నుంచి ఎ.రవి, తామా ముత్యాలమ్మ, పశ్చిమగోదావరి జిల్లా నుంచి జక్కంశెట్టి సత్యనారాయణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఏలూరు జిల్లా నుంచి ఎం.జీవరత్నం, పిల్లి రామకృష్ణ, తుమ్మల సత్యనారాయణ, శేషపు మహంకాళిరావు, పశ్చిమగోదావరి జిల్లా నుంచి బాతిరెడ్డి జార్జి, బల్ల చినవీరభద్రం, కండెల్లి సోమరాజు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమాల్లో వ్యకాస జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.జీవరత్నం, పివి.రామకృష్ణ, సిఐటియు నేతలు డిఎన్‌విడి.ప్రసాద్, ఆర్.లింగరాజు, పి.కిషోర్, గిరిజన సంఘం నేతలు తెల్లం రామకృష్ణ, తెల్లం దుర్గారావు, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు పి.మంగరాజు, స్థానిక నేతలు సుభాని, వంగా గోపీ, పి.సూర్యారావు, గుడెల్లి వెంకట్రావు, ఎ.ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి పోరాటాలు చేయాలి
వి.కృష్ణయ్య, ఎపి రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు వ్యవసాయ కార్మికులు, రైతులు భుజంభుజం కలిపి ఐక్య ఉద్యమాలు చేపట్టాలని ఎపి రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కష్ణయ్య అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు ప్రభుత్వమని చెబుతున్నప్పటికీ గతం కన్నా 10 శాతం ఆత్మహత్యలు పెరిగాయన్నారు. చిన్న రైతులు వ్యవసాయం చేయలేని విధంగా పరిస్థితులు మారాయన్నారు. దేశవ్యాప్తంగా కనీస మద్దతు ధర అనే అంశం ముందుకు వస్తుందని తెలిపారు. ఇది రానున్న రోజుల్లో మహా ఉద్యమంగా మారుతుందని అన్నారు. 13 నెలలు రైతులు పోరాడి చారిత్రాత్మకంగా మోడీ మెడలు వంచి విజయం సాధించారన్నారు.
భూ పంపిణీ జరిగే వరకు పోరు
ఆహ్వాన సంఘం కార్యదర్శి ఎ.రవి
రాష్ట్రంలో పేదలకు భూ పంపిణీ జరిగే వరకు పోరాడాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.రవి అన్నారు. శనివారం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపంలో మహాసభ ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి పంచాలి కూలి పెంచాలి, వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమం ప్రతి గ్రామంలో విస్తరించాలని అన్నారు.
బలమైన ఉద్యమాన్ని నిర్మిద్దాం
డిఎన్‌విడి.ప్రసాద్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి
రాష్ట్రంలో వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి బలమైన ఉద్యమాన్ని నిర్మిద్దామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్ పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల ఫలితంగా కార్మికుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయయాంత్రికరణ పెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. గ్రామీణ సేవకులను ఐక్యం చేసేందుకు ఐక్య ఉద్యమాలు నిర్మిద్దామని అన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం యాజమాన్యానికి ఊడిగం చేసేలా కార్మికుల హక్కులను కాలరాస్తూ లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందన్నారు. రానున్న రోజుల్లో ఐక్య పోరాటాలు నిర్మించాలన్నారు.
నిరుద్యోగ కార్మిక సమస్యలపై పోరాటానికి సిద్ధం
డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న
నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో ఉపాధి కోల్పోతున్న నిరుద్యోగ కార్మిక సమస్యపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించి నట్టేట ముంచారని విమర్శించారు. ఈ సమస్యపై యువతను చైతన్యపరిచి కార్మిక శక్తితో ఐక్య ఉద్యమాలకు సన్నద్ధమవుతామని తెలిపారు.
పోరాటమే నినాదం
డాక్టర్ వజ్ర కిరణ్, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు
కార్మికులందరికీ పోరాటమే నినాదం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘ గౌరవాధ్యక్షులు డాక్టర్ వజ్రకిరణ్ అన్నారు. శనివారం మహాసభ ముగింపు కార్యక్రమంలో డాక్టర్ వజ్ర కిరణ్‌ను నేతలు శాలువాతో సత్కరించారు. అనంతరం వజ్రకిరణ్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటం ఒక్కటే మార్గమన్నారు. కార్మికులు ఐక్యంగా హక్కుల కోసం ముందుకు సాగాలని సూచించారు. కార్మిక సమస్యలపై నిర్వహించే కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.










