Oct 02,2022 23:56

నినాదాలు చేస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు మండలం చింతలవీధి గ్రామ సభను ఆదివారం ఉబ్బెటిపుట్టు, నదిమివీధి గ్రామ ప్రజలు బహిష్కరించారు. హైవే రోడ్డు దిగ్బంధం, తమ భమిని వైసిపి కార్యాలయం నిర్మాణం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, దీనిపై వెంటనే గ్రామ సభలో తీర్మానం చేసే వరకు కదిలేది లేదని ఆందోళన చేపట్టారు. స్పందించి గ్రామసభలో తీర్మానం చేయడంతో గ్రామ ప్రజలు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎల్‌ సుందర్రావు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కే.నరసయ్య, భూ పోరాట సాధన కమిటీ అధ్యక్షులు సతీష్‌, సుమన్‌, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
'నిధులు లేని గ్రామ సభలు ఎందుకు'?
ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:మండలంలో దారెల పంచాయతీ తల్లింబ గ్రామంలో పంచాయతీ సెక్రెటరీ ఆధ్వర్యంలో గ్రామ సభను ఆదివారం నిర్వహించారు. సర్పంచ్‌ పాండురంగ స్వామి మాట్లాడుతూ, నిధులు లేని గ్రామసభలు ఎన్ని నిర్వహించినా వ్యర్ధమే అని అన్నారు. గ్రామల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పలువురు డిమాండ్‌ చేశారు. విద్య, వైద్య, వ్యవసాయ, ఇంజినీరింగ్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, డ్వాక్రా ఇతర శాఖల పై సమీక్ష చేసి పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ప్రజలు కోరారు. పంచాయతీ నిధులు పంచాయతీ ఖాతాలలో జమ చేయాలని సర్పంచ్‌ పాండురంగ స్వామి కోరారు. ఈ గ్రామ సభలో ఎంపిటిసి మల్లికార్జునరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.