ప్రజాశక్తి-అద్దంకి: భక్తి, రక్తి, భావుకతల సమ్మేళనం, కల్మషంలేని గ్రామీణ ప్రజల జీవనాన్ని ప్రతిబింబించే కథల సమాహారమే ఆంధ్రగాథాలహరి పుస్తకమని ప్రముఖ కవి ఆర్‌వి రాఘవరావు అన్నారు. సాహితీ మిత్రమండలి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రామసుశీల నిలయంలో జరిగిన పుస్తక రచయిత డివిఎం సత్యనారాయణ అభినందన సభకు లక్కరాజు చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి సభా సంచాలకులుగా వ్యవహరించారు. శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ పద్యాలతో పాటు కథలకు పుట్టినిల్లు తెలుగునేల అని అన్నారు. తెలుగు గ్రామీణ ప్రజల జీవన విధానాన్ని, వారి మనోవ్యాపారాలను, మంచి భావుకత కలిగిన కవిత్వాన్ని ఈ పుస్తకం ద్వారా సత్యనారాయణ అందించారని పేర్కొన్నారు. ముఖ్య అతిథి, పద్యకవి అన్నాపంతుల జగన్నాథరావు మాట్లాడుతూ డివిఎం సత్యనారాయణ నడుస్తున్న శబ్దరత్నాకరం అని అభివర్ణించారు. వీరి రచనా శిల్పం అత్యద్భుతమని పేర్కొన్నారు. ఆ రచనాశిల్పం సజీవమైన మనిషిలా మనతో సంభాషిస్తుందని అన్నారు. లక్కరాజు శ్రీనివాసరావు సత్యనారాయణ రచించిన భజగోవిందం పుస్తకాన్ని పరిచయం చేశారు. శంకరాచార్యుల భజగోవిందాన్ని తెనుగుచేసి, ఆ కావ్యంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, భక్తి వైరాగ్య చింతనలను ప్రజలు సులభంగా గ్రహించేలా కవిత్వీకరించాడని అన్నారు. ధిషణ, ధార, ధారణ గల పద్యకవి సత్యనారాయణ అని, ఆయన రచనలు పండిత పామరులు మెచ్చుకునే విధంగా ఉంటాయని ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మరావు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యు దేవపాలన, గాడేపల్లి దివాకర దత్తు, చుండూరి మురళీ సుధాకర్, చిన్నిమురళీకృష్ణ, కొండకావూరి కుమార్, కంఠంరాజు శివరామ కోటేశ్వరరావు, చప్పిడి వీరయ్య, కోలలపూడి శ్రీనివాస రావు, కె అనిల్‌కుమార్ సూరి, మిట్టా కామేశ్వరశర్మ, వామరాజు వెంకటేశ్వర్లు, నిమ్మరాజు నాగేశ్వర రావు, సంకా బాబు, గోపినాథం హరనాథ్, అద్దంకి లెవీప్రసాదు, మిడసల మల్లికార్జున రావు, పిసిహెచ్ కోటయ్య, మన్నం త్రిమూర్తులు, నర్రా శ్రీలక్ష్మి, అంజాద్‌బాషా, కె నాగయ్య, ధర్మవరపు శ్రావణ్, చామర్తి సత్యనారాయణ, తమ్మన శ్రీనివాసరావు, ఓరుగంటి శ్రీనివాసులు, కూరపాటి రామకోటేశ్వరరావు, లక్కరాజు విశ్వమోహన్, రాధాకృష్ణమూర్తి, ఎన్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. సభానంతరం డివిఎం సత్యనారాయణ దంపతులను ఘనంగా సాహితీ మిత్రమండలి సత్కరించింది. ఈ కార్యక్రమంలో సాహితీ ప్రియులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.










