గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారానికే 'జగనన్నకు చెబుదాం': కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
ప్రజాశక్తి - ముసునూరు
మారుమూల గ్రామాల్లోని ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడమే 'జగనన్నకు చెబుదాం' స్పందన కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. ముసునూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి శుక్రవారం నిర్వహించిన 'జగనన్నకు చెబుదాం' మండలస్థాయి స్పందన కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. మండలంలోని చింతలవల్లి, కాట్రేనిపాడు, ముసునూరు, గోపవరం, చిల్లబోయినపల్లి, రమణక్కపేట, గోగులంపాడు, గుళ్లపూడి, చెక్కపల్లి తదితర గ్రామాల నుండి పెద్దఎత్తున ప్రజలు ఈ కార్యక్రమంలో తమ సమస్యలను కలెక్టర్‌కు తెలిపారు. సమస్యలపై అక్కడే ఉన్న జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడి వాటిల్లో అధికశాతం సమస్యలను అక్కడికక్కడే పరిష్కారమయ్యేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాస్థాయి స్పందన దరఖాస్తుల్లో అధికశాతం మారుమూల గ్రామాల నుండే అందుతున్నాయని, అందుకే ప్రజలకు మరింత వీలుగా ఉండేలా ప్రజల వద్దకే స్పందన కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నామన్నారు. స్పందనలో ప్రజల సమస్యలను తెలుసుకోవడంతోపాటు, వాటికి నాణ్యమైన పరిష్కారం అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారన్నారు. శుక్రవారం జరిగిన స్పందనలో 242 దరఖాస్తులు అందాయని కలెక్టర్ చెప్పారు. గుడిపాడు గ్రామానికి చెందిన మందలపు నాగభూషణం తన తాతగారైన మందలపు చినపేరయ్య 3.71 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని, కానీ అది ప్రభుత్వ రికార్డుల్లో పోరంబోకు స్థలంగా నమోదైందని, దాన్నిసరిచేయాలని వినతిని అందించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ దాసరి సుధని కలెక్టర్ ఆదేశించారు. అక్కిరెడ్డిగూడేనికి చెందిన ప్రజలు తమ గ్రామానికి శ్మశానవాటిక ఏర్పాటుకు భూమిని కేటాయించాలని, గ్రామంలో డ్రెయినేజీ సమస్యను పరిష్కరించాలని కోరగా, వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ ఎస్‌ఇని కలెక్టర్ ఆదేశించారు. గోపవరం గ్రామానికి చెందిన కర్ర వెంకటరమణ తనకు జగనన్న ఇల్లు మంజూరు చేయాలని కోరగా వెంటనే చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మల్లవల్లి కోటేశ్వరరావు తన దరఖాస్తులో తన భూమి ఆక్రమణకు గురైందని, తనకు న్యాయం చేయాలని కోరగా పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముసునూరుకు చెందిన సోలా కృష్ణ తన దరఖాస్తులో తన ఇంటిపక్కనే కోళ్ల ఫారం ఏర్పాటు చేశారని, దీని కారణంగా దుర్వాసనతో పాటు అపారిశుధ్యం, అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. దీనిపై వెంటనే విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒని కలెక్టర్ ఆదేశించారు. చింతలవల్లి గ్రామానికి చెందిన పల్లెపాము ఆంజనేయులు తన పొలానికి వెళ్లే మార్గం గుంతలతో దారుణమైన పరిస్థితిలో ఉందని, మరమ్మతులు చేయాలని కోరగా, తగు చర్యలు తీసుకోవాలని పంచాయత్ రాజ్ ఎస్‌ఇని కలెక్టర్ ఆదేశించారు. ముసునూరు గ్రామస్థులు తమ గ్రామంలోని పిహెచ్‌సికి మరమ్మతులు చేయాలని, గ్రామంలో పశువుల ఆసుపత్రి శిథిలావస్థలో ఉందని, కొత్త భవనం నిర్మించాలని, ఎస్‌సి కాలనీలో కమ్యూనిటీ భవనం నిర్మించాలని కోరగా, పిహెచ్‌సి, భవనానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బి ఎస్‌ఇకి ఆదేశాలు జారీ చేశారు. పశువుల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి నివేదిక సమర్పించాలని పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్‌ను కలెక్టర్ ఆదేశించారు. కమ్యూనిటీ భవన నిర్మాణానికి సంబంధించి నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రమణక్కపేటకు చెందిన బత్తిన రామకృష్ణ తనకు రైస్ కార్డు మంజూరు చేయాలని కోరగా, వెంటనే చర్యలు తీసుకోవాలని డిఎస్‌ఒను ఆదేశించారు. ఇలా పలు వినతులను కలెక్టర్ స్వీకరించి పరిష్కారానికి ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి, నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా పరిషత్ సిఇఒ కె.రవికుమార్, డిఆర్‌డిఎ పీడీ విజయరాజు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ విశ్వనాధ్, వ్యవసాయ శాఖాధికారి వై.రామకృష్ణ, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ నెహ్రుబాబు, ఆర్‌టిఒ శ్రీహరి, డ్వామా పీడీ రాము, ఎంపిపి కృష్ణ కుమారి, జెడ్‌పిటిసి సభ్యులు ప్రతాప్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










