ప్రజాశక్తి - దేవనకొండ
మండల వ్యాప్తంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు వీరశేఖర్, మండల నాయకులు సూరి సంజన, అశోక్, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని కోటకొండ, కప్పట్రాళ్ల, తెర్నేకల్లు, కుంకనూరు, పొట్లపాడు గ్రామ సచివాలయాల ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. సచివాలయ కార్యదర్శికి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండలంలో తాగునీటి సమస్య ఉందని, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. సాగునీటికి ప్రధానమైన హంద్రీనీవా పంటకాలువ నిర్మాణం, కరివేముల, తెర్నేకల్ మధ్య హంద్రీనీవా కాలువ పెండింగ్ పనులు, హంద్రీనీవా కాలువ మొదటి దశ పనులు కూడా పూర్తి కాకపోవడంతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న హంద్రీనీవా కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గుండ్లకొండ దగ్గర హంద్రీనీవాకు స్లూయిజ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈఏడాది పంటల బీమాలో పత్తి పంటకు బీమా రాకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. పత్తి పంటకు బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల లింకు రోడ్ల నిర్మాణం అధ్వానంగా ఉందని, లింక్ రోడ్లను పునర్నిర్మించాలని కోరారు. కోటకొండలో పిహెచ్‌సి ఏర్పాటు, పొట్లపాడు దగ్గర హంద్రీపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. టర్నింగ్ దగ్గర నుంచి కుంకనూరు వరకు పాత రోడ్డు పునర్నిర్మించాలని కోరారు. సిపిఎం నాయకులు యూసుఫ్ బాష, బజారి, గాజుల శ్రీనివాసులు, ఓంకార్, అనిల్, సుభాన్, మహబూబ్ బాషా, నాగరాజు, ఈరన్న, చంద్రశేఖర్, మహేంద్ర, శీను, గిడ్డయ్య, లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు.
వినతి పత్రం అందిస్తున్న సిపిఎం నాయకులు










