- పనిదినాల కల్పనలో రాష్ట్రం అగ్రస్థానం
- ఎన్‌ఆర్‌ఇజిఎ డైరెక్టర్ చినతాతయ్యలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఉపాధి హామీ దోహదపడుతుందని ఎన్‌ఆర్‌ఇజిఎ రాష్ట్ర డైరెక్టర్ పి.చినతాతయ్యలు అన్నారు. జిల్లాలో ఉపాధి హామీ అమలుతీరుపై జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ ఏడాది 24 కోట్ల పనిదినాలను లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఇప్పటివరకు 18 కోట్ల పనిదినాలను పూర్తి చేశామన్నారు. డిబిటి పద్ధతిలో కూలీలకు కూలి డబ్బులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో 45 లక్షల కుటుంబాలకు రూ.6 వేల కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. 60 వేల ఎకరాల్లో ఉద్యానవనాల పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. జలుమూరు, సారవకోట మండలాల్లో టెక్నికల్ అసిస్టెంట్ కేడర్‌లో ఉన్న వ్యక్తికి రెండు మండలాల ఎపిఒ బాధ్యతల్లో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ఆ మండలాల్లో పనులు సక్రమంగా చేయకపోవడానికి ఇదే ప్రధాన కారణమన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలను ఎపిడిలు, ఎపిఒలు సక్రమంగా నిర్వహించడం లేదని, దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఇప్పటికైనా లక్ష్యాలు పూర్తి కావడానికి ఎపిఒలు పూర్తి బాధ్యత వహించాలన్నారు. మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. మానవ వనరులను సాంకేతికత జోడించి అమలు చేస్తున్నామన్నారు. మునగ పంటతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, అందువల్ల రైతుల్లో మునగ పంటపై విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు జి.వి చిట్టిరాజు, ఎపిడిలు, ఎపిఒలు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.










