May 12,2023 21:09

సమావేశంలో మాట్లాడుతున్న రామాంజనేయులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
గ్రామీణ ప్రాంత రోడ్ల దుస్థితిపై కలెక్టర్‌, ఆర్‌అండ్‌బి ఎస్సీ దృష్టి పెట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బి.రామాంజనేయులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్‌లో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంత రోడ్లు పూర్తి అద్వాన స్థితికి చేరాయని తెలిపారు. ఏడాది క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రంలోని రోడ్లకు మరమ్మతులు చేస్తామని హామీఇచ్చారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సుల్లో ప్రయాణించాలంటే కూడా అధ్వానంగా ఉందన్నారు. ఎమ్మిగనూరు నుంచి కోసిగి, ఎమ్మిగనూరు నుంచి పోలకల్‌, గుడికల్‌ గ్రామంలో ఇరుకైన రోడ్లు, ట్రాఫిక్‌ అంతరాయంగా మారుతోందని చెప్పారు. ఎమ్మిగనూరు నుంచి చిన్నహుల్తి, పట్టణంలో బైపాస్‌ రోడ్డు పనులు వేగవంతం చేయాలని కోరారు. కొత్త రోడ్లు వేసేందుకు బడ్జెట్‌ కేటాయించాలని, ఆర్‌అండ్‌బి అధికారులు, జిల్లా అధికారులు, జిల్లా పాలకులు పట్టించుకోవాలని కోరారు. సిపిఎం తాలూకా, పట్టణ నాయకులు హనుమంతు, రాముడు, నరసింహులు, అబ్దుల్లా, పి.రాజు పాల్గొన్నారు.