Dec 09,2022 23:13

జెండావిష్కరణతో రెండో రోజు
వ్యకాస 29వ రాష్ట్రమహాసభ ప్రారంభం
సంఘం చరిత్రపై పాటూరి
రామయ్య రాసిన పుస్తకావిష్కరణ
గ్రామాల్లో సంఘ బలోపేతంపై
దృష్టి పెట్టాలి: విజయరాఘవన్‌
సమరశీల పోరాటాలతోనే మార్పు
తథ్యమని దిశానిర్దేశం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి, జంగారెడ్డిగూడెం

               గ్రామీణ పేదల సమస్యలే ఎజెండా.. వారి బతుకుల్లో తాత్కాలిక, శాశ్వత మార్పునకు చేయాల్సిన ఉద్యమ కార్యాచరణపై చర్చోపచర్చలతో వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభ రెండోరోజు శుక్రవారం సాగింది. జంగారెడ్డిగూడెం శివార్లలో దండమూడి రామలక్ష్మి కల్యాణ మండపంలో సంఘ పతాకావిష్కరణతో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. తొలుత సీనియర్‌ నాయకులు, మాజీ ఎంఎల్‌ఎ పాటూరి రామయ్య జెండావిష్కరణ చేశారు. అనంతరం పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు స్వరాజ్యం, శంకరన్‌, శ్రీరామ్మూర్తి, అన్నే వెంకటేశ్వరరావు, అనూసయమ్మ తదితర అమరవీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం ప్రతినిధుల సభ ప్రారంభమైంది. తొలుత ఆహ్వాన సంఘం అధ్యక్షులు షేక్‌ సాబ్జీ అధ్యక్షోపన్యాసం చేశారు. సభకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధి అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు విజయ రాఘవన్‌ మాట్లాడుతూ 29వ మహాసభలో చర్చించాల్సిన అంశాలు, భవిష్యత్తులో ముందుకు సాగాల్సిన విషయాలపై దిశానిర్ధేశం చేశారు. గ్రామీణ ప్రజలతో అంతా మమేకమై వారి సమస్యలపై పోరాడాలని, ఈ మహాసభలో దానిపైనే ప్రధానంగా చర్చించాలని సూచించారు. ఢిల్లీలో రైతుల పోరాటమే మనందరికీ స్ఫూర్తి అని అన్నారు. పేదల సమస్యలు, వేతనాలపై చర్చించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు తీవ్ర నష్టం కల్గిస్తున్నాయన్నారు. దీంతో కార్మికులు గ్రామాలను వదిలి పట్టణాలకు వలసపోతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామాల్లో నిరుద్యోగం పెరుగుతుందని తెలిపారు. రాజకీయాల్లో ధనప్రభావం పెరిగిపోయిందని, అవినీతి సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఎన్నికల్లో రూ.200 కోట్లు నుంచి రూ.300 కోట్లు వరకూ ఖర్చు పెడుతున్నారన్నారు. కుల ప్రభావం సైతం పెరిగిపోయిందన్నారు. అనంతరం సీనియర్‌ నేత పాటూరి రామయ్య రాసిన 'ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమ చరిత్ర' పుస్తకాన్ని విజయరాఘవన్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆహ్వానసంఘం ఉపాధ్యక్షులు దండమూడి ప్రసాద్‌, మాజీ ఎంఎల్‌ఎసి, బికెఎంయు రాష్ట్ర అధ్యక్షులు జల్లి విల్సన్‌, ఆహ్వానసంఘం గౌరవాధ్యక్షులు మేకా ఈశ్వరయ్య, మాజీ ఎంఎల్‌ఎ, సీనియర్‌ నాయకులు పాటూరి రామయ్య, వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం నాయకులు సోమయ్య మాట్లాడారు. అనంతరం జిల్లాలవారీగా ప్రతినిధుల చర్చలు సాగాయి. సంఘం కేరళ రాష్ట్ర కార్యదర్శి చంద్రన్‌ తమ రాష్ట్ర అనుభవాలపై ప్రసంగించారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు నడిచాయి. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్‌, రైతుసంఘం పూర్వపు రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, పూర్వ రాష్ట్ర కార్యదర్శి మంతెన సీతారాం, నేతలు ఎ.రవి, పిల్లి రామకృష్ణ, జీవరత్నం, పలువురు నాయకులు పాల్గొన్నారు.
సంపద సృష్టికర్తలకు అప్పులా
ఆహ్వాన సంఘం అధ్యక్షులు, ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ
సమాజంలో 90 శాతం శ్రమజీవులైన వ్యవసాయ కార్మికులకు నేడు అప్పులు, ఆత్మహత్యలు మిగులుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ అన్నారు. శుక్రవారం ప్రతినిధుల ప్రారంభ సభలో ఆయన అధ్యక్షోపన్యాసం చేస్తూ పశ్చిమగోదావరి జిల్లాకు అనేక రంగాల్లో ఘనమైన చరిత్ర ఉందన్నారు. జిల్లా విభజన అనంతరం ఏలూరు జిల్లాగా అవతరించాక మరింత ప్రాముఖ్యత పెరిగిందన్నారు. అటువంటి జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభ నిర్వహించడం అభినందనీయమన్నారు. మారుతున్న కాలంలో వ్యవసాయ కార్మికులకు రోజువారీ పని దినాలు తగ్గిపోయి సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులకు కనీస కూలి కష్టమైపోతుందన్నారు. భూమి తల్లిని నమ్ముకుని సాగులో ప్రధాన పాత్ర పోషించే వ్యవసాయ కూలీలు గౌరవంగా జీవించేందుకు పోరాటాలే మార్గమని అన్నారు.
ఎర్రజెండా ఉండగా కార్పొరేట్‌ ఆటలు సాగవు
ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్‌ దండమూడి ప్రసాద్‌
సమాజంలో వ్యవసాయ రంగాన్ని మోస్తున్నది 70 శాతం ప్రజలు, వ్యవసాయ కార్మికులేనని ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్‌ దండమూడి ప్రసాద్‌ అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభ ప్రారంభ సభలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల స్థితిగతులను మార్చేందుకు ప్రత్యేక కార్పొరేషన్‌ అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ సంపద కొద్దిమంది చేతుల్లో ఉందన్నారు. శ్రమించే వారందరికీ సంపద దక్కాలన్నారు. సమాజంలో ఎర్రజెండా ఉన్నంతకాలం కార్పొరేట్ల ఆటలు సాగవని ఆయన అన్నారు. వ్యవసాయ కార్మికుల స్థితిగతులను మార్చుకునేందుకు కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు ఐక్యం కావడం ఎంతో అవసరమన్నారు.
ఐక్య పోరాటాలు చేయాలి
మాజీ ఎంఎల్‌సి జల్లి విల్సన్‌
శ్రమ జీవులైన వ్యవసాయ కార్మికులకు న్యాయమైన కూలి రేట్లు, సామాజిక న్యాయం కోసం వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభ దోహదపడుతుందని మాజీ ఎంఎల్‌సి జల్లి విల్సన్‌ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య గ్రామంలో పుట్టిన వ్యవసాయ కార్మిక సంఘం ఇది. ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు ఒకే సమస్య.. ఒకే ఎజెండాపై పోరాటాలు నిర్వహిస్తున్నాయి. భూమి పంచేందుకు, కూలి పెంచేందుకు రానున్న రోజుల్లో ఐక్యఉద్యమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు పోరాడి సాధించుకున్న భూసంస్కరణ చట్టం, అటవీ హక్కుల చట్టం, కనీస కూలి చట్టాలను పెట్టుబడిదారీ ప్రభుత్వాలు చెత్తబుట్టలో వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనేరు రంగారావు భూసిఫార్సులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నవరత్నాల్లో భూపంపిణీ ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. వ్యవసాయ కార్మికుల్లో అత్యధికులు దళితులు, గిరిజనులు ఉన్నారని, వారిని ఏకం చేసేందుకు ఐక్య ఉద్యమాలు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
దళితులు, గిరిజనుల నిలువుదోపిడీ
ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు మేకా ఈశ్వరయ్య
నేటికీ దళితులు, గిరిజనులు నిలువు దోపిడీకి గురవుతున్నారని ప్రముఖ న్యాయవాది, మహాసభ ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు మేకా ఈశ్వరయ్య అన్నారు. ప్రతినిధుల ప్రారంభ సభలో ఆయన మాట్లాడుతూ మెట్టప్రాంతంలో గిరిజనుల మాన, ప్రాణాలు దోచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదిగా తన దృష్టికి వచ్చిన అనేక గిరిజన కేసుల్లో చాలామంది తండ్రి ఎవరో తెలియని దుస్థితిలో ఉన్నారన్నారు. గతంలో తాను కమ్యూనిస్టుగా.. వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడిగా పని చేసిన సమయంలో తనపై 300కు పైగా కేసులు నమోదు చేశారని, రెండేళ్లపాటు జైలు జీవితం గడిపానని తెలిపారు. ఆ సమయంలో పోలవరం మండలంలో అన్యాయంగా కేసులు మోపబడి జైలుకు వచ్చిన కూలీలు పదిమందిని చైతన్యపరిచి ఆ మండలంలో వ్యవసాయ కార్మిక సంఘం స్థాపనకు బీజం వేశామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దోపిడీకి గురవుతున్న వర్గాలు అంబేద్కర్‌ భావజాలంపై ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ పేరిట కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.
భూమి కోసం ఉద్యమం..
వ్యకాస సీనియర్‌ నేత, మాజీ ఎంఎల్‌ఎ పాటూరి రామయ్య
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
వ్యవసాయ కార్మికులు శాశ్వత ఉపాధి కోసం, భూమి కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్‌ నేత, మాజీ ఎంఎల్‌ఎ పాటూరి రామయ్య అన్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభలో ప్రతినిధుల ప్రారంభ సభ సందర్భంగా సంఘ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం పోరాటాలలో అమరవీరులకు నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం వ్యవస్థాపకులు పుచ్చలపల్లి సుందరయ్య, అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లు తెలిపారు. అనంతరం ప్రతినిధుల ప్రారంభ సభలో పాటూరి రామయ్య మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం చేపట్టిన ఉద్యమాలు, పోరాటాల డిమాండ్లను బూర్జువా ప్రభుత్వాలు అవసరం మేరకు సంక్షేమ పథకాల పేరుతో నామమాత్రంగా అమలు చేస్తున్నాయన్నారు. బూర్జువా ప్రభుత్వాల పాలనలో సమాజంలో దారిద్య్ర నిర్మూలన, సమానత్వం సాధ్యం కాదన్నారు. వ్యవసాయ కార్మికుల జీవనోపాధి మెరుగుపడాలంటే వారిని చైతన్యపరిచి భూమి సాధించే వరకు పోరాటాలు చేయాలని అన్నారు. తామంతా వ్యవసాయ కూలీల కోసం అప్పట్లో చేసిన ఉద్యమాలకు వారసత్వ ఉద్యమాలు, పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
సంఘ ఉద్యమ చరిత్ర పుస్తకావిష్కరణ
వ్యవసాయ కార్మిక సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంఎల్‌ఎ పాటూరు రామయ్య రచించిన 'వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమ చరిత్ర' పుస్తకాన్ని సంఘం జాతీయ అధ్యక్షులు విజయ రాఘవన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల చేతిలో భూమి లేకుండా వారి జీవితాల్లో మార్పు సాధ్యం కాదన్నారు. భూమి కావాలనే నినాదం తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం అన్నారు. వ్యవసాయ కార్మికులు, దళితులు, పేదలు అనేక పోరాటాలు చేస్తే పాలక పార్టీలు ఆ సమస్యలు పరిష్కరించకుండా అమ్ముల పొది నుంచి తీసినట్లు సంక్షేమ పథకాల పేరుతో అమలు చేస్తారని ఎద్దేవా చేశారు. బూర్జువా, భూస్వామ్య, పెట్టుబడిదారీ ప్రభుత్వాలు ఉన్నంతకాలం పేదరికం, దారిద్య్రం రూపుమాపలేమన్నారు. పేదల బతుకుల్లో సంపూర్ణ మార్పు రావాలంటే అది సోషలిజం ద్వారానే సాధ్యమన్నారు. అందుకు ఉద్యమాలు విస్తరించడమే మార్గమన్నారు.