Nov 02,2023 23:55

ప్రజాశక్తి - భట్టిప్రోలు
మండలంలోని పెదపులివర్రు, గోరిగపూడి, ఓలేరు గ్రామాల్లో మూడు బృందాలుగా  గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా గురువారం పర్యటించి వివిధ అంశాలను పరిశీలించారు. గురిగిపూడి గ్రామానికి జిల్లా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ అధికారిని వి వనజ, తహశీల్దారు ధూళిపూడి వెంకటేశ్వరరావు, ఓలేరు పంచాయతీకి జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి ఎస్ విష్ణుమూర్తి, ఎంపీడీఒ గుమ్మా చంద్రశేఖర్, పెదపులివర్రు పంచాయతీకి  ఐఆర్ఆర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్‌కె భాషా, ఈఒ పిఆర్ అండ్ ఆర్డి ఊహారాణి, ఎంఈఓ2 నీలం దేవరాజ్ బృందాలుగా వ్యవహరించారు. అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, సచివాలయాలు, జగనన్న కాలనీలు, నాడు నేడు పనులు జరిగిన పాఠశాలలు వంటి వివిధ అంశాలను సమీక్షించారు. అంగన్వాడి కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం సక్రమంగా అందుతుందా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీల ఫోన్ నెంబర్లను సేకరించి వారికి ఫోన్ చేసి మరీ పథకాలు అందుతున్నాయా లేదో అని సమాచారాన్ని సేకరించారు. కేంద్రం నిర్వహణ రికార్డులు పరిశీలించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం, నాడు నేడు పథకం కింద జరిగిన పనుల పనితీరు, ఆరోగ్యప కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలు, మందుల సరఫరా వంటి అంశాలను పరిశీలించారు. అలాగే జగనన్న  కాలనీలలో కనీసం మౌలిక వసతులైన రహదారులు, త్రాగునీరు విద్యుత్ వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. తమ పరిశీలనతో వెలుగు చూసిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచులు నీలా ఉషారాణి, రమేష్, గరికపాటి మల్లికా వెంకటేశ్వరరావు, మేరుగ రంగారావు, కార్యదర్శులు జక్రియా, శ్రీదేవి పాల్గొన్నారు.