May 20,2023 00:39
పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేస్తున్న ఎస్‌పి

ప్రజాశక్తి-వేటపాలెం: ప్రారంభ దశలోనే నేరాలను అరికట్టడంలో గ్రామ సచివాలయ మహిళ పోలీసుల పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఐపీఎస్‌ తెలిపారు. వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం ఉదయం ఎస్పీ చీరాల సబ్‌ డివిజన్‌ పరిధిలోని వేటపాలెం పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ నిర్వహించారు. ముందుగా సిబ్బంది వద్ద నుంచి గౌరవ వందనం స్వీకరించి స్టేషన్‌ పరిసరాలను, ఎస్‌హెచ్‌ఓ, రైటర్‌, కంప్యూటర్‌ గదులను, కేస్‌ ప్రాపర్టీ భద్రపరిచిన గదిని పరిశీలించారు. కేసు ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలన్నారు. వేటపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయ మహిళ పోలీసులు, పోలీస్‌ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై వారు చేస్తున్న విధుల గురించి తెలుసుకున్నారు. ''మహిళా పోలీస్‌ డ్యూటీ ట్రాకర్‌'' వెబ్‌ సైట్‌లో వారి రోజువారి విధుల వివరాలను పొందుపరుస్తు న్నారా లేదా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రారంభ దశలోనే నేరాలను అరికట్టడంలో గ్రామ సచివాలయ మహిళా పోలీసుల పాత్ర కీలకమని ఎస్పీ తెలిపారు. పోలీస్‌ శాఖ ప్రతినిధిగా సచివాలయ పరిధిలో జరిగే విషయాలను తెలుసుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓకు తెలియజేయాలన్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలు, కుటుంబ తగాదాలు, స్థల వివాదాలు, వర్గ విభేదాల గురించిన సమాచారం తెలుసుకొని వారిపై నిఘా వుంచి వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓకు తెలియపరచాలన్నారు. దానివలన నేరాలను ప్రారంభ దశలోనే అడ్డుకోవచ్చునన్నారు. పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే పోలీస్‌ సిబ్బంది వారి దత్తత గ్రామాలను వారానికి ఒకసారి కచ్చితంగా సందర్శించాలన్నారు. గ్రామంలోని ప్రజలతో మమేకమై గ్రామాలలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా, వస్తే వారి వివరాలు తెలుసుకోవాలన్నారు. పాత నేరస్తుల కదలికలు, గ్రామంలో ఎవరి మధ్యనైనా వర్గ పోరు నడుస్తుందా, వారి వివరాలు తెలుసుకోవాలన్నారు. విచారణ దశలో ఉన్న కేసులలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, వృత్తి నైపుణ్యాన్ని జోడించి వేగవంతంగా దర్యాప్తు చేయాలన్నారు. ఇటీవల వేటపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 8 సంవత్సరాల మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి సంవత్సరం కాలంలోనే యావజ్జీవ కారాగార శిక్ష పడిందన్నారు. అదేవిధంగా మిగిలిన కేసులలో కూడా ముద్దాయిలకు శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకోవాలని స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓను, కోర్ట్‌ కానిస్టేబుల్‌లను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించే వివిధ క్రైమ్‌ రికార్డులను, సిడి ఫైల్స్‌ను పరిశీలించారు. ప్రతి కేసు ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, ఆ కేసులో దర్యాప్తు ఎలా నిర్వహించారు, కేసు పురోగతిని ఎప్పటికప్పుడు సిసిటిఎన్‌ఎస్‌లో నమోదు చేస్తున్నారో లేదో అని జిల్లా ఎస్పీ స్వయంగా సిసిటిఎన్‌ఎస్‌లో సరిపోల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో చీరాల డిఎస్‌పి ఎస్‌. ప్రసాదరావు, చీరాల రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏ మల్లికార్జున, జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏ శ్రీనివాస్‌, సిసి హరికృష్ణ వేటపాలెం పోలీస్‌ స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జి సురేష్‌, చీరాల రూరల్‌ ఎస్‌ఐ జనార్దన్‌, వేటపాలెం పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది, మరియు గ్రామ/వార్డు సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు.