May 02,2023 23:45

కన్నూరుపాలెంలో ఎడ్డ పరుగు పందెం పోటీలు

ప్రజాశక్తి- విలేకర్ల బృందం
జిల్లాలోని కె.కోటపాడు మండలం చౌడువాడలో పెద్ద పైడిమాంబ, దేవరాపల్లి మండలం తారువలో మర్లమాంబ, కశింకోట మండలం కన్నూరుపాలెంలో పైడితల్లమ్మ, అనకాపల్లి మండలం గొలగాం గ్రామంలో పైడిమాంబ అమ్మవారుల పండగ మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి.
పెద్ద పైడిమాంబ అమ్మవారి తీర్థం
కె.కోటపాడు : మండలంలోని చౌడువాడ గ్రామంలో మంగళవారం పెద్ద పైడిమాంబ అమ్మవారి తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి పూజలు చేసి మొక్కలు తీర్చుకొని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి మహిళల కోలాట పోటీలు నిర్వహించి గెలుపొందిన 10 గ్రూపుల మహిళలకు బహుమతులు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, జనసేన పార్టీ మాడుగుల నియోజకవర్గం నాయకులు రాయపురెడ్డి కృష్ణ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి దాడి ఎరుకు నాయుడు, ఉత్సవ కమిటీ ప్రతినిధి రాజి శ్రీనివాసరావు, విశాఖ డెయిరీ డైరెక్టర్‌ సుందరపు గంగాధర్‌, ఎంపీటీసీ ఏటుకూరు రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.
మర్లమాంబ అమ్మవారి మహోత్సవం
దేవరాపల్లి : మండలంలోని తారువ మర్లమాంబ అమ్మవారి పండగ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. 11 వసంతాలు తరువాత జరుగుతున్న పండగకు దూర ప్రాంతాల్లో ఉరటున్న గ్రామస్తులు రావడంతో ఊరంతా కోలాహలంగా మారిపోయింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను డిప్యూటీ సిఎం బూడి దగ్గర ఉండి పర్యవేక్షించారు. గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు. గ్రామంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
పైడితల్లమ్మ అమ్మవారి పండగ
కశింకోట : మండలంలోని కన్నూరుపాలెం గ్రామంలో మంగళవారం పైడితల్లమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఇందులో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఎడ్ల పరుగు పందేం పోటీలను మంత్రి అమర్నాథ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు దంతులూరి శ్రీధర్‌ రాజు, కశింకోట, అనకాపల్లి ఎంపిపిలు కలగా లక్ష్మి, గొర్లి సూరిబాబు, సర్పంచ్‌లు కలగా గున్నయ నాయుడు, శిరపరపు శివ, హనుమంతు వెంకట లక్ష్మణరావు పాల్గొన్నారు.
పైడిమాంబ అమ్మవారి జాతర
అనకాపల్లి : మండలంలోని గొలగాం గ్రామంలోని శ్రీపైడిమాంబ అమ్మవారి జాతర మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మండల పరిషత్‌ అధ్యక్షులు గొర్లి సూరిబాబు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆయనను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నాగ నరసింగరావు, గ్రామ వైసిపి నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.