Nov 15,2023 20:59

నెల్లిమర్ల: మేనిఫెస్టో పత్రాలను పంపిణీ చేస్తున్న టిడిపి నాయకులు రవిశేఖర్‌, గేదెల రాజారావు

ప్రజాశక్తి - నెల్లిమర్ల : మండలంలోని సీతారాముని పేటలో టిడిపి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. టిడిపి సీనియర్‌ నాయకులు, ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిశీలకులు సువ్వాడ రవిశేఖర్‌ ఆధ్వర్యంలో నాయకులు గ్రామంలో ఇంటింటికి తిరిగి భవిష్యత్‌ గ్యారెంటీ బాండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, మండల ప్రధాన కార్యదర్శి గుర్రాన చక్రి, నాయకులు గొర్లే శ్రీనివాసరావు, నాయకులు దనాన శ్రీరాములు, అట్టాడ పైడిరాజు, దనాన పైడిరాజు, తాళ్లపూడి రామకృష్ణ, లెంక తాత, నేతేటి సుగుణ తదితరులు పాల్గొన్నారు. బొండపల్లి: 2024 ఎన్నికలలో చంద్రబాబును ఎన్నుకోవడం ద్వారానే రాష్ట్రం బాగు పడుతుందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ అన్నారు. బుధవారం మండల సముదాయం వద్ద వివిధ వర్గానికి చెందిన వారికి టిడిపి మినీ మేనిఫెస్టో పై కరపత్రాలు ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలు పూర్తిగా అదోగతిపాలు అయ్యాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. భోగాపురం: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని టిడిపి నియోజకవర్గం ఇంచార్జ్‌ కర్రోతు బంగార్రాజు అన్నారు. మండలంలోని రామచంద్ర పేట గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్నారు. ఇంత కక్షపూరితమైన పాలన రాష్ట్ర ప్రజలు ఎప్పుడు చూసి ఉండరన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు కర్రోతు సత్యన్నారాయణ, ఉపాధ్యక్షులు కోలా రామసూరి, ఎంపిటిసి దువ్వు కొత్తయ్య, నాయకులు, బూత్‌ ఇంచార్జ్‌లు పాల్గొన్నారు.
శృంగవరపుకోట: టిడిపి అధికారంలోకి రాగానే ఇంటింటికి సురక్షిత తాగునీటి కొళాయిలను వేయిస్తామని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అన్నారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఒక్కరి హక్కు అని కానీ రాష్ట్రంలో ఈ హక్కును కూడా కాలరాసే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. చాలా ప్రాంతాల్లో కొళాయి కనెక్షన్లు లేవని కనెక్షన్లు ఉన్న చోట కూడా నీళ్లు రావడం లేదని విమర్శించారు. చాలా గ్రామాల్లో తాగు నీరు కోసం మహిళలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావని గుక్కెడు తాగునీళ్ల కోసం పనులన్నీ మానుకుని మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తోందని గుర్తు చేశారు. టిడిపి అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటి కుళాయి కనెక్షన్‌ వేస్తామని అన్నారు.