Oct 21,2023 00:01

ప్రజాశక్తి-రామచంద్రపురం
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛత మన బాధ్యత అనే కార్యక్రమం గ్రామాల్లోకి తీసుకువెళ్లి ప్రతి గ్రామంలోని అమలు చేయాలని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సూచించారు. ఆయన శుక్రవారం రామచంద్రపురం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి అంబటి భవాని అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సర్పంచ్‌, ఎంపిటిసి సభ్యులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కలిసి పనిచేయాలన్నారు. అదేవిధంగా గ్రామాలను చెత్తరహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రెండు నెలల్లో విజయవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చిందన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు కొరత ఏర్పడిందని సచివాలయ సిబ్బంది రావడంతో ఆదనపు భారం పడిందని ఇప్పుడు మళ్లీ ఏ నిధులు ఖర్చు పెట్టాలని పలువుర ప్రజాప్రతినిధులు ప్రశ్నించారు. గ్రాంట్లు లేకుండా పనులు చేయలేమని ప్రజాప్రతినిధులు ముక్తకంఠం తో సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమానికి మండల పరిషత్‌ నిధులు ఇవ్వాలని వారంతా డిమాండ్‌ చేశారు. ఈనెల 22 స్థానిక లయన్స్‌ కల్యాణ మండపంలో జరిగే సమావేశంలో ఈ విషయాలను మంత్రి దష్టికి తీసుకువెళ్లాలని ఎంపిపి భవానీ సభ్యులకు సూచించారు. వ్యవసాయ శాఖ ఎఇ సత్య ప్రసాద్‌ రైతులంతా ఇక్రాప్‌ నమోదు తో పాటు జిపిఎస్‌ చేయించుకోవాలన్నారు. అదేవిధంగా పలు ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంపిటిసి సభ్యుల ను, సర్పంచ్‌లను పిలవడం లేదని, ఫ్రొటోకాల్‌ పాటించడం లేదని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో విద్యుత్‌ శాఖ ఎఇ ఏసురాజు, ఎంపిడిఒ కీర్తి స్పం దన, తహశీల్దార్‌ ఎం. వెంకటేశ్వర రావు, ఇఒపిఆర్‌డి ఎం.సల ట్‌ రాజు, ఉపాధ్యక్షులు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
జెడ్‌పిటిసి సభ్యునిపై దాడికి ఖండన
ఇటీవల తోటపేటలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రామచంద్రపురం జెడ్‌పిటిసి సభ్యుడు మెర్నిడి వెంకటేశ్వరరావుపై దాడి చేసిన సంఘటనను మండలపరిషత్‌ సమావేశంలో సభ్యులు ఖండించారు. ప్రజా ప్రతినిధిపై దాడిచేసిన దామిశెట్టి గంగా పురుషోత్తం, అతని కుమారుడు సత్యనారాయణమూర్తులపై చర్యల తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.