ప్రజాశక్తి -పద్మనాభం : గ్రామాల్లో సమస్యలపై సిపిఎం ఆధ్వర్యాన ఈ నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సర్వే నిర్వహిస్తామని జివిఎంసి 72వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు తెలిపారు. పలు గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలతో ఆదివారం సమావేశమై మాట్లాడారు. పద్మనాభం మండలంలో ల్యాండ్ పూలింగ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని రైతుల ఆందోళన చెందుతున్నారని, దీనిపై పక్కాగా సర్వే చేసి రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు. ఆగస్టు నెలాఖరు నాటికి సర్వేను పూర్తి చేయాలని, అందుకు అందరి సహకారం కావాలని కోరారు. ప్రభుత్వాలే చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే పేద, బలహీన వర్గాలకు న్యాయం ఎక్కడ దొరుకుతుందన్నారు. మజ్జివలస రాజకుటుంబానికి చెందిన వైసిపి నాయకుడు భీమిలి మండలం లక్ష్మీపురం గ్రామంలో సుమారు 5 ఎకరాల భూమిని తన రాజకీయ పలుకుబడితో స్వాధీనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడని, రైతుల నిలదీయడంతో భూమిపైకి రాలేకపోయాడని తెలిపారు. పద్మనాభం మండలంలో కనీసం ఉపాధి లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామస్థాయిలో ప్రజలు సమస్యలను ముందుకు తీసుకొస్తే జిల్లా కలెక్టర్ దృష్టిలో పెడతామని చెప్పారు. నిరుపేద రైతుల దగ్గర ఉన్న భూములకు 22ఎ కింద చూపించి నిషేధించడం అన్యాయమన్నారు. గ్రామాల్లో సంఘాలు ఏర్పాటు చేసుకుంటే సమస్యలపై పోరాటం చేయగలుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్‌ఎస్‌ఎన్.మూర్తి, రవ్వ నర్సింగరావు, రాము, చందర్రావు తదితరులు పాల్గొన్నారు.










